UK political crisis: మెడపై కత్తి

7 Jul, 2022 05:30 IST|Sakshi

సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి
బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుపాకాన పడుతోంది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారుతోంది. అనేక ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆయన తక్షణం రాజీనామా చేయాలంటూ స్వపక్షం నుంచే తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. మంగళవారం ఇద్దరు సీనియర్‌ మంత్రుల రాజీనామాతో రాజకీయంగా కలకలం రేగింది. వారి స్థానంలో వెంటనే కొత్తవారిని నియమించి ఎంపీలంతా తన వెంటే ఉన్నారని చెప్పుకునేందుకు జాన్సన్‌ ప్రయత్నించినా పోతూ పోతూ బోరిస్‌పై మంత్రులు చేసిన విమర్శలు అంతటా చర్చనీయంగా మారాయి.

పైగా ఆ కలకలం సద్దుమణగకముందే బుధవారం ఏకంగా మరో డజను మంది మంత్రులు ప్రధానిపై నమ్మకం పోయిందంటూ గుడ్‌బై చెప్పారు! దీంతో బోరిస్‌ ఎలా నిలదొక్కుకోవాలో తెలియని అయోమయంలో పడ్డారు. కేబినెట్‌లోని ఇతర మంత్రులు ఇంకా తనతోనే ఉన్నదీ లేనిదీ ఆరా తీయాల్సిన పరిస్థితి దాపురించింది. జాతి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోకుండా జాన్సన్‌ ఇష్టమొచ్చినట్టుగా పరిపాలిస్తుండటమే గాక పలు అంశాలపై నోటికొచ్చినట్టు అబద్ధాలాడి విశ్వసనీయత కోల్పోయారన్నవి ఆయనపై ప్రధాన విమర్శలు.

గత నెల జరిగిన ఉప ఎన్నికల్లో టివర్టన్, హోనిటన్, వేక్‌ఫీల్డ్‌ స్థానాలను కన్జర్వేటివ్‌ పార్టీ కోల్పోవడం, పార్టీ చైర్మన్‌ ఒలివర్‌ డోడెన్‌ రాజీనామా వంటివి జాన్సన్‌ పనితీరుపై తాజాగా ప్రశ్నలు రేకెత్తించిన పరిణామాలు. అప్పటికే పార్టీ గేట్‌ వివాదం ఆయన్ను వెంటాడుతుండగా, తాజాగా మొదలైన రాజీనామాల పర్వంతో ప్రధానిగా ఆయన పరిస్థితి మరింత దిగజారింది. అసమర్థతను అంగీకరించి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని, లేదంటే పార్టీయే ఉద్వాసన పలకాల్సి వస్తుందని కన్జర్వేటివ్‌ ఎంపీ ఆండ్రూ బ్రిడ్జెన్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాట ధోరణితో దేశాన్ని బోరిస్‌ఇబ్బందుల్లోకి నెడుతున్న తీరును పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (1922) క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు.

ఇదే అదనుగా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత సర్‌ కెయిర్‌ కూడా గొంతు సవరించుకున్నారు. ఉన్నపళంగా ఎన్నికలకు వెల్లడమే శ్రేయస్కరమని, దేశం సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పుకొచ్చారు. ఆరోపణలు, వివాదాలు, అసమర్థత కలగలిసి బోరిస్‌ను అశక్తున్ని చేశాయన్నారు. ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కుప్పకూలడం ఖాయమని వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్‌ ఎంపీలు వెంటనే బోరిస్‌కు ఉద్వాసన పలికి దేశభక్తి చాటుకోవాలంటూ విపక్ష ఎంపీలు పిలునివ్వడం విశేషం! బ్రిటన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని తన అధికారాన్ని ఉపయోగించి ముందస్తు ఎన్నికలకు ఆదేశించవచ్చు.

మద్దతుకూ కొదవ లేదు
స్వపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బోరిస్‌కు మద్దతు కూడా అదే స్థాయిలో ఉంది. పార్టీ నాయకునిగా, ప్రధానిగా ఆయన కొనసాగాలనే అధిక సంఖ్యాకులు కోరుకుంటున్నారు. కానీ పాలనా దక్షతపై సందేహాల నేపథ్యంలో పదవి నిలబెట్టుకోవాలంటే బోరిస్‌గట్టి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం. ఇటీవల జరిగిన పార్టీపరమైన విశ్వాస పరీక్షలో 359 మంది కన్జర్వేటివ్‌ ఎంపీల్లో 211 మంది బోరిస్‌కు మద్దతుగా ఓటేశారు. అంటే 148 మంది ఆయనపై అవిశ్వాసం వెలిబుచ్చినట్టు. గత ప్రధాని థెరెసా మే కూడా 2018లో బ్రిగ్జిట్‌ పాలసీపై ఇలాగే పార్టీపరమైన విశ్వాస పరీక్షలో 83 ఓట్లతో గట్టెక్కారు. అయినా ఆర్నెల్లకే రాజీనామా చేశారు. 2003లో డంకన్‌ స్మిత్‌ విశ్వాస పరీక్షలో కొద్ది తేడాతో ఓడి తప్పుకున్నారు. 1990లో మార్గరెట్‌ థాచర్‌ విశ్వాస పరీక్షలో 204–152 ఓట్లతో నెగ్గినా కేబినెట్‌ నిర్ణయానికి తలొగ్గి ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

తప్పుకోక తప్పదా!
జాన్సన్‌ పార్టీ విశ్వాస పరీక్షలో నెగ్గినా ప్రధాని పదవిని ఎంతోకాలం నిలబెట్టుకోవడం అనుమానమే. ఉప ఎన్నికల ఓటమి, పార్టీ గేట్, మంత్రుల రాజీనామాల వంటివి ఆయన పదవికి ఎసరు తెచ్చే అవకాశాలే ఎక్కువ. ఏడాది దాకా మళ్లీ విశ్వాస పరీక్షకు అనుమతించని కన్జర్వేటివ్‌ పార్టీ నిబంధనలను మారిస్తే అది అంతిమంగా బోరిస్‌ ఉద్వాసనకు దారి తీయొచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం.

ఇవీ వివాదాలు
పార్టీ గేట్‌
కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న సమయంలో దాని కట్టడికి అమల్లో ఉన్న నిషేధాలు, నియమాలను ఉల్లంఘిస్తూ ప్రధాని జాన్సన్‌ అధికార నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్లో, పలు ఇతర ప్రభుత్వ ఆవాసాల్లో విచ్చలవిడిగా పార్టీలు జరిగాయి. 16కు పైగా పార్టీలు జరిగినట్టు ఇప్పటిదాకా తేలింది. వీటిలో పలు పార్టీల్లో జాన్సన్‌ స్వయంగా పాల్గొన్నారు. మొదట్లో బుకాయించినా ఆ తర్వాత ఈ విషయాన్ని ఆయన అంగీకరించారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ప్రధానే అడ్డంగా నిబంధనల్ని ఉల్లంఘిస్తారా అంటూ ఇంటా బయటా ఆయనపై దుమ్మెత్తిపోశారు. రాజీనామా డిమాండ్లు కూడా అప్పటినుంచీ ఊపందుకున్నాయి.

పించర్‌ గేట్‌
కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన వివాదాస్పద ఎంపీ క్రిస్‌ పించర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల పరంపరను పించర్‌ గేట్‌గా పిలుస్తున్నారు. ఆయనపై ఈ ఆరోపణలు కొత్తవేమీ కాదు. కొన్నేళ్లుగా ఉన్నవే. తాజాగా గత జూన్‌ 29న ఓ ప్రైవేట్‌ పార్టీలో ఇద్దరు పురుషులను పించర్‌ అభ్యంతరకరంగా తాకారన్న ఆరోపణలపై వారం క్రితం పార్టీ  ఆయనను సస్పెండ్‌ చేసింది. గతంలోనూ సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలతోనూ పించర్‌ ఇలాగే వ్యవహరించారని ఆరోపణలున్నాయి. పించర్‌ను డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమిస్తూ 2019లో జాన్సన్‌ తీసుకున్న నిర్ణయం ఇప్పుడాయన మెడకు చుట్టుకుంది. ఆయనపై లైంగిక ఆరోపణల విషయం తనకు తెలియదని జాన్సన్‌ చెబుతూ వచ్చారు. కానీ అదాయనకు ముందునుంచీ తెలుసని బయట పెడటంతో తీవ్ర దుమారం రేగింది. లైంగిక ఆరోపణలున్న ఎంపీకి కీలక పదవి కట్టబెట్టడమే గాక అడ్డంగా అబద్ధాలాడిన వ్యక్తి నాయకత్వంలో పని చేయలేమంటూ కీలక మంత్రులు రిషి సునక్, జావిద్‌ రాజీనామా చేయడం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది.  
ఏం జరగవచ్చు?
1. విశ్వాస పరీక్షను ఏడాదికి ఒక్కసారికి మించి జరపరాదన్న కన్జర్వేటివ్‌ పార్టీ నిబంధనను ఎత్తేస్తే బోరిస్‌ను దించేందుకు మరోసారి ప్రయత్నం జరుగుతుంది. ఆయనకు ఉద్వాసన పలకాలంటే 54 మంది కంటే ఎక్కువ ఎంపీలు ఆ మేరకు ‘1922 కమిటీ’ చైర్మన్‌కు లిఖితపూర్వకంగా నివేదించాల్సి ఉంటుంది. అప్పుడు రహస్య ఓటింగ్‌ ద్వారా విశ్వాస పరీక్ష జరుగుతుంది. గెలిస్తే బోరిస్‌ కొనసాగుతారు. లేదంటే పార్టీకి కొత్త నాయకున్ని ఎన్నుకుంటారు. ఆయనే ప్రధాని కూడా అవుతారు.
2.  పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, అందులో బోరిస్‌ ఓడితే రాజీనామా చేయాల్సి వస్తుంది. ముందస్తు ఎన్నికలు    జరుగుతాయి.
3.  ఇంటాబయటా వస్తున్న తీవ్ర ఒత్తిళ్లకు తలొగ్గి మార్గరెట్‌ థాచర్‌ మాదిరిగానే బోరిస్‌ తనంత తానే తప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు