భారతీయ విద్యార్థులకు లబ్ధి.. రెండేళ్లలో ఈ వీసాపై ఉద్యోగాలు

17 Jun, 2021 10:38 IST|Sakshi

యూకే పీఎస్‌డబ్ల్యూ వీసా దరఖాస్తు గడువు పెంపు

లండన్‌: యూకే యూనివర్సిటీలో కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలు కల్పించే పోస్ట్‌ స్టడీ వీసా (పీఎస్‌డబ్ల్యూ)కు దరఖాస్తు చేసే  గడువును బ్రిటన్‌ ప్రభుత్వం పెంచింది. దీని మూలంగా భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. యూనివర్సిటీ కోర్సులు పూర్తయిన తర్వాత రెండేళ్లలో ఈ వీసాపై ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అంటే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాన్వేషణ నిమిత్తం రెండేళ్లు యూకేలో ఉండటానికి ఈ వీసా వీలు కల్పిస్తుంది. యూకే హోమ్‌ సెక్రటరీ ప్రితీ పటేల్‌ గత ఏడాది ప్రారంభించిన ఈ వీసాలకు దరఖాస్తు చేసే గడువు జూన్‌ 21తో ముగిసిపోతుంది.

అయితే కోవిడ్‌–19 సంక్షోభం కారణంగా చాలామంది విద్యార్థులు సకాలంలో యూకేకు వెళ్లలేకపోయారు. దీంతో గడువుని సెప్టెంబర్‌ 27 వరకు పెంచారు. యూకేకి విద్యార్థిగా వచ్చి ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సెప్టెంబర్‌ 27లోగా రావాల్సి ఉంటుందని యూకే  అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. డెల్టా వేరియెంట్‌ వెలుగులోకి వచ్చాక భారత్‌ నుంచి ప్రయాణాలపై యూకే నిషేధం విధించి రెడ్‌ లిస్టులో ఉంచడంతో వీసా గడువు పెంచాలని నేషనల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ అండ్‌ అలుమ్ని యూనియన్‌ యూకే (ఎన్‌ఐఎస్‌ఏయూ) విస్తృతంగా ప్రచారం చేసింది.

చదవండి: పీసీసీపై కాంగ్రెస్‌ కసరత్తు.. తెరపైకి వచ్చిన ఇద్దరు నాయకులు

>
మరిన్ని వార్తలు