బ్రిటన్‌ ఆర్థికమంత్రి క్వాసిపై వేటు

15 Oct, 2022 05:15 IST|Sakshi

మినీ బడ్జెట్‌ వివాదాస్పదం కావడంతో ప్రధాని లిజ్‌ ట్రస్‌ నిర్ణయం

కొత్త ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్‌ నియామకం

లండన్‌ : బ్రిటన్‌ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌పై ప్రభుత్వం వేటు వేసింది. క్వాసీని పదవి నుంచి ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ తొలగించారు. గత నెలలో క్వాసీ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. దీంతో క్వాసీని ఆర్థిక మంత్రిగా తప్పించి ఆయన స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు.

కరోనా, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నుల్లో భారీగా కోత విధిస్తూ క్వాసీ రూపొందించిన మినీ బడ్జెట్‌ బెడిసికొట్టింది. దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాల ను చూపించకుండా దాదాపుగా 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహా యింపులనిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో స్టాక్‌ మార్కెట్లు కుప్ప కూలాయి.

ప్రధానికి క్వాసీ  సన్నిహితుడు కావడంతో గత కొద్ది రోజులుగా లిజ్‌ మినీ బడ్జెట్‌ను సమర్థిస్తూ వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో క్వాసీని తప్పించాల్సి వచ్చింది. క్వాసీని తప్పించినందుకు లిజ్‌ ట్రస్‌ ఆయనకు రాసిన లేఖలో సారీ చెప్పడమే కాకుండా దీర్ఘకాలంలో ఈ బడ్జెట్‌ దేశానికి మంచి చేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన జెరెమీ హంట్‌ ప్రధాని పదవికి గతంలో పోటీ పడ్డారు. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి పదవిని చేపట్టడం హంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు