పీఎంగా రిషి సునాక్‌ తొలిసారి బిగ్‌ యూ-టర్న్‌.. ఆ నిర్ణయంలో మార్పు

2 Nov, 2022 17:27 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవంటూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. అయితే, ప్రధాని పీఠంపై కూర్చున్న మొట్టమొదటి సారి బిగ్‌ యూటర్న్‌ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేశీయ బాధ్యతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి క్లైమేట్‌ సమ్మిట్‌కు వెళ్లకూడదని ముందుగా నిర్ణయించుకున్న రిషి సునాక్‌.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తాను పర్యావరణ సదస్సుకు హాజరవుతున్నట్లు ట్వీట్‌ చేశారు.

‘పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకుండా బంగారు భవిష్యత్తు లేదు. పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెట్టకుంటే విద్యుత్తు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లే. అందుకే.. వచ్చే వారం జరగనున్న కాప్‌27 క్లేమేట్‌ సదస్సుకు హాజరవబోతున్నా. సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించే గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నా.’ అని ట్వీట్‌ చేశారు రిషి సునాక్‌. 

ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్-షేక్ రెడ్ సీ రిసార్ట్‌లో జరిగే సమావేశానికి హాజరు కాకూడదని సునాక్ తీసుకున్న నిర్ణయం పర్యావరణ ప్రచారకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిషి సునాక్‌ ట్వీట్‌ చేయకముందే యూ-టర్న్‌పై హింట్ ఇచ్చారు ఆయన అధికార ప్రతినిధి. నిర్ణయంపై పునఃసమీక్షిస్తున్నట్లు చెప్పారు. దానికన్నా ముందు మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది కాప్‌ 26 సమావేశానికి ఆయన ప్రధాని హోదాలో హాజరయ్యారు.

ఇదీ చదవండి: ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు!

మరిన్ని వార్తలు