కోవిషీల్డ్‌ ఓకే.. సర్టీఫికెట్‌తోనే సమస్య

23 Sep, 2021 05:42 IST|Sakshi

మరో మెలిక పెట్టిన బ్రిటన్‌

లండన్‌: కరోనా వ్యాక్సిన్‌ అంశంలో భారత్, బ్రిటన్‌ మధ్య చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ విషయంలో  బ్రిటన్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టే తగ్గి మళ్లీ  మెలిక పెట్టింది. అక్టోబర్‌ 4 నుంచి విదేశీ ప్రయాణికులు పాటించాల్సిన కోవిడ్‌ నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను కొద్దిరోజుల కిందట బ్రిటన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో  కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ లేకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఆ దేశం దిగొచ్చింది.

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో తమకు ఎలాంటి సమస్య లేదన్న యూకే అధికారులు, భారత్‌ జారీ చేసే వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రంపైనే కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.  కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ జాబితాలో ఆ్రస్టాజెనికా కోవిషీల్డ్‌ను చేరుస్తూ బుధవారం నిబంధనల్ని సవరించారు. అయితే కోవిషీల్డ్‌ తీసుకున్నప్పటికీ భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రం అంశంలో భారత్, యూకే పరస్పరం చర్చించుకుంటున్నాయని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని వెల్లడించారు. విదేశీ ప్రయాణికుల మార్గదర్శకాల్లో బ్రిటన్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను చేర్చకపోవడంపై భారత్‌ పదునైన విమర్శలే చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌–ఆ్రస్టాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌నే పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోవిషీల్డ్‌ పేరుతో చేస్తోందని, అలాంటప్పుడు ఆ వ్యాక్సిన్‌పై ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ నిలదీసింది.

భారత్‌లో తయారైన టీకాలు పనికొచ్చినప్పుడు... అదే టీకా వేసుకున్న వారు బ్రిటన్‌కు ఎందుకు రాకూడదంటూ సూటిగా ప్రశ్నించింది. భారత్‌ విమర్శలతో వెనక్కి తగ్గిన బ్రిటన్‌ వ్యాక్సిన్‌కి అంగీకరించినప్పటికీ, భారత్‌ జారీ చేసే వ్యాక్సిన్‌ ధ్రువపత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేదని, అందుకే ఆ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ క్వారంటైన్‌ నిబంధనలు పాటించి తీరాలని చెప్పింది. మరోవైపు భారత్‌ అధికారులు మాత్రం వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ జారీ చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్య లేదని, డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనలకి అనుగుణంగానే జారీ చేస్తున్నామని చెబుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు