ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా..

21 Jan, 2022 17:35 IST|Sakshi

లండన్​: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం  థర్డ్​వేవ్​ విజృంభణకు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు కొత్తగా పుట్టుకొస్తున్న భిన్నరకాల వేరియంట్​లు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి.  అయితే, శాస్త్రవేత్తలు కరోనాను ఎదుర్కొవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.  వివిధ రకాల వ్యాక్సిన్​లపై ఇప్పటికి ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

ప్రపంచదేశాలు ప్రధానంగా..  కరోనాను గుర్తించడానికి ర్యాపిడ్​ ఆంటిజెన్​, ఆర్టీపీసీఆర్​లను పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటితో చాలా వరకు వ్యక్తిలో వైరస్​ ఉన్నది.. లేనిది నిర్ధారణ అవుతుంది. కొన్నిసార్లు టెస్ట్​ల సంఖ్య పెరగడంతో ఆర్టీపీసీఆర్​ ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. దీంతో ఆయా వ్యక్తులు ఫలితం వచ్చేవరకు ఒకింత ఒత్తిడికి లోనవుతున్నారు.

తాజాగా, యూకేకు చెందిన శాస్త్రవేత్తలు ఒక తీపి కబురు అందించారు. ఇక నుంచి కరోనాను కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిర్ధారించవచ్చని తెలిపారు. దీనితో.. ఒక వ్యక్తి పాజిటివ్​గా ఉన్నాడా లేదా అన్నదానిని ఎక్స్​రే టెక్నిక్​ను ఉపయోగించి కొన్ని నిమిషాల వ్యవధిలోనే సులభంగా గుర్తించవచ్చు. ఇది ఆర్టీపీసీఆర్​ స్థానాన్ని భర్తీ చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

యూకే శాస్త్రవేత్తల  ప్రకారం.. కొత్త ఎక్స్​రే విధానంలో ఖచ్చితంగా, తక్కువ సమయంలో కరోనాను నిర్ధారించవచ్చని తెలిపారు. దీనితో వేచి ఉండే సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. దీని కోసం శాస్త్రవేత్తల బృందం కృత్రిమ మేధస్సును ఉపయోగించినట్లు తెలిపారు. దీనికోసం కరోనాతో బాధపడుతున్న వారు, నిమోనియాలో బాధపడుతున్నవారు, ఆరోగ్యవంతుల్లోని ఎక్స్​రే స్కాన్​లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. దాదాపు 3000 ఎక్స్​రేలను చూశామని, వీటిలో కరోనా నిర్ధారణ 98 శాతం ఖచ్చితత్వంతో నిర్ధారించిందని పేర్కొన్నారు.

యూనివర్సిటీ ఆఫ్​ ది వెస్ట్​ స్కాట్లాండ్​ (యూడబ్ల్యూఎస్​)లో ఒక బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనితో ఇక నుంచి టెస్ట్​ల సంఖ్య పెంచుకోవచ్చు. ప్రపంచంలో చాలా చోట్ల వైరస్​ విజృంభణతో కరోనా కిట్​ల  కొరత నెలకొంది. ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్​ నయీమ్ రంజాన్ మాట్లాడుతూ.. ఇది కరోనాను వెంటనే నిర్ధారిస్తుందని తెలిపారు.ఇది ఆర్టీపీసీఆర్​కు ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతుందని  తెలిపారు.

ప్రపంచంలో కేసులు పెరగడం, రోగ నిర్ధారణ సాధనాల తక్కువడా ఉండటం వలన పెద్ద సంఖ్యలో కొవిడ్​ పరీక్షలు నిర్వహించలేకపోతున్నాయని పేర్కొన్నారు. అయితే, కొత్త ఎక్స్​ రే విధానంతో సులభంగా కరోనాను గుర్తించవచ్చని తెలిపారు. అయితే, ఎక్స్​రే రేటియేషన్​తో మానవునిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఈ కిరణాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. వైద్యులు కొవిడ్​ పరీక్షల కోసం తక్కువ మోతాదులో రేటియేషన్​ ఉపయోగిస్తారని తెలిపారు. అయితే, ఈ కొత్త సాంకేతికను ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారనేది భవిష్యత్తులో తెలుస్తుందని ప్రొఫెసర్​ రంజన్​ అభిప్రాయపడ్డారు.

చదవండి: ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్‌ కంటే

మరిన్ని వార్తలు