అక్రమ వలసదారులపై ఉక్కుపాదం.. రిషి సునాక్‌ కొత్త చట్టం.. తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు!

8 Mar, 2023 07:57 IST|Sakshi

లండన్‌: అక్రమ వలసదారులను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా తెచ్చిన కొత్త పథకం(అక్రమ వలసల కట్టడి బిల్లు).. విమర్శలకు తావు ఇస్తోంది. బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని సునాక్ తాజాగా హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు కొత్త చట్టం తీసుకురాగా.. తద్వారా అక్రమ చొరబాట్లను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. అయితే ఈ చట్టంపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

మీరు చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే..  ఆశ్రయం పొందలేరు. ఆధునిక బానిసత్వ రక్షణల నుంచి ప్రయోజనం పొందలేరు.  మీరు నకిలీ మానవ హక్కుల దావాలు చేయలేరు. ఇక్కడ ఉండలేరు అంటూ ట్వీట్‌ చేశారాయన. చట్టవిరుద్ధంగా ఇక్కడికి ప్రవేశించేవాళ్లను అదుపులోకి తీసుకుని.. కొన్ని వారాలలోపు వాళ్లను పంపించేస్తాం. సురక్షితమని భావిస్తే.. వాళ్ల సొంత దేశానికే పంపిస్తాం. కుదరకుంటే రువాండా లాంటి మరో దేశానికి తరలిస్తాం. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నాసరే మా దేశంలోకి మళ్లీ ప్రవేశించకుండా నిషేధించబడతారు అంటూ హెచ్చరించారాయన. 

ఇల్లీగల్‌ మైగ్రేషన్‌ బిల్లుగా పిలవడబడుతున్న ముసాయిదా చట్టం.. ఇంగ్లీష్‌ చానెల్‌ గుండా చిన్నచిన్న బోట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే వాళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది సౌత్‌ఈస్ట్‌ ఇంగ్లండ్‌ గుండా 45 వేలమంది వలసదారులు బ్రిటన్‌కు చేరుకున్నారు. ఇది గత ఐదేళ్లలుగా పోలిస్తే.. వార్షికంగా 60 శాతం పెరిగిందని నివేదికలు చెప్తున్నాయి. 

రిషి సునాక్‌ తీసుకొచ్చిన కొత్త పథకంపై మానవ హక్కుల సంఘాలు, బ్రిటన్‌ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కొత్త చట్టం వర్కవుట్‌ అయ్యే అవకాశమే లేదని, అంతర్జాతీయ చట్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావొచ్చని ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు  ఈచట్టంతో దుర్బల పరిస్థితుల్లో ఉన్న శరణార్థులు బలి పశువులు అవుతారంటూ  వాదిస్తున్నాయి మానవ హక్కుల సంఘాలు.

మూలాలను ప్రస్తావించిన హోం సెక్రెటరీ
ఇదిలా ఉంటే.. బ్రిటన్‌ హోం కార్యదర్శి Suella Braverman సుయెల్లా బ్రేవర్‌మాన్(భారత సంతతి).. మంగళవారం కొత్త చట్టాన్ని ప్రకటించారు. అక్రమ వలసల కట్టడి బిల్లు ప్రకారం.. చిన్న చిన్న పడవలపై అక్రమంగా యూకేలోకి వచ్చే వలసదారులను అదుపులోకి తీసుకుని.. వాళ్లను వీలైనంత త్వరగా బయటకు పంపించేస్తారు. ఈ చట్టం చట్టవిరుద్ధమైన వలసలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బలమైన విధానమని బ్రేవర్‌మాన్‌ ప్రకటించారు. అంతేకాదు.. బిల్లు గురించి ప్రకటించే సమయంలో ఆమె తన స్వంత వలస మూలాలను కూడా ప్రస్తావించారు. బ్రేవర్‌మాన్‌ తండ్రి గోవాకు చెందిన వ్యక్తి, అలాగే తల్లి తమిళ మూలాలున్న వ్యక్తి. 

ఇప్పుడు.. యూకే ప్రపంచంలోని అత్యంత దుర్బలమైన శరణార్థులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2015 యూకే దాదాపు ఐదులక్షల మందికి పైగా ఆశ్రయం అందించింది.  హాంకాంగ్ నుండి 150,000 మంది, ఉక్రెయిన్ నుంచి 1,60,000 మంది ప్రజలు.. అలాగే తాలిబాన్ చెర నుంచి పారిపోయి చేరుకున్న అఫ్ఘన్లు పాతిక వేల మంది దాకా ఉన్నారు. వాస్తవానికి.. నా తల్లిదండ్రులు దశాబ్దాల కిందట ఈ దేశంలో భద్రత,  అవకాశాలను కనుగొన్నారు. ఇందుకు నా కుటుంబం ఎప్పటికీ బ్రిటన్‌కు కృతజ్ఞతలు తెలుపుతుంది అని తెలిపారామె. 

అయినప్పటికీ.. మన సరిహద్దులను ఉల్లంఘించే అక్రమ వలసదారుల అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం అంటే..  మనల్ని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి ద్రోహం చేసినట్టే అని పేర్కొన్నారామె. 

కొత్త చట్టం నుంచి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల లోపు వాళ్లకు అదీ తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉన్నవారికి, ప్రాణ హాని ఉన్నవారిని యూకేలోకి అనుమతిస్తారు.

:::మేరిగ కుసుమ కుమారి

మరిన్ని వార్తలు