వైద్యులను భయపెట్టిన బ్రెయిన్‌ డెడ్‌ రోగి

31 Mar, 2021 18:51 IST|Sakshi
లూయిస్‌ ఫైల్‌ ఫోటో(ఫోటో కర్టెసీ: టైమ్స్‌ నౌ)

ఆపరేషన్‌ చేసే గంట ముందు అద్భుతం

లండన్‌: బ్రెయిన్ డెడ్‌తో కోమాలోకి జారుకొనే వ్యక్తులను.. బతికున్న శవంగా భావిస్తారు. వారు మళ్లీ స్పృహలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఆశ చావక వైద్యం కొనసాగిస్తే.. మరి కొందరు మాత్రం తమ బిడ్డ ఎలాను బతకడు.. తన అవయవాలను దానం చేస్తే.. మరి కొందరి ప్రాణాలైనా నిలబడతాయనే ఆశతో అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తారు. ఇలాంటి స్థితిలో ఇక బతకడు అని డిసైడ్‌ అయ్యి.. అతడికి ఆపరేషన్‌ చేద్దామనుకుంటుండగా.. సదరు బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి శరీరంలో కదలిక వస్తే.. చాలా విచిత్రంగా ఉంటుంది కదా ఆ పరిస్థితి.

ఇలాంటి ఘటన యూకేలో చోటు చేసుకుంది. అయితే, యూకేలోని లీక్ అనే పట్టణానికి చెందిన లూయిస్ రాబర్ట్స్ అనే 18 ఏళ్ల యువకుడి విషయంలో విచిత్రం చోటుచేసుకుంది. బ్రెయిన్ డెడ్‌తో ఇక బతికే అవకాశాలు లేవని భావించిన వైద్యులు.. అతడి అవయవాలను మరొకరికి దానం చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో అవయవాలు తొలగిస్తారనగా లూయిస్ కళ్లు తెరిచాడు.

ఈ ఏడాది మార్చి 13న లూయిస్ ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. దాంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్యులు అత్యాధునిక వైద్యం అందించినప్పటికి అతడు కోలుకోలేదు. పూర్తిగా కోమాలోకి జారుకున్న లూయిస్‌కు వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. మార్చి 17న వైద్యులు మరోసారి అతడికి పరీక్షలు నిర్వహించారు. అతడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని .. బతికే అవకాశాలు లేవని డిక్లేర్‌ చేశారు. దాంతో లూయీస్ కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానమిచ్చేందుకు అంగీకరించారు.

లూయిస్ అవయవాలు తొలగించేందుకు వైద్యులు అతడికి కృత్రిమ శ్వాస అందించడం నిలిపేశారు. సర్జరీకి ఒక గంట సమయం ఉందనగా.. లూయిస్ తనంతట తానే ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. ఊహించని ఈ ఘటనకు వైద్యులు తొలత షాక్‌ అయ్యారు. ఆ తర్వాత ఈ విషయాన్ని లూయిస్ కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ఆశ్చర్యపోయారు. అతడు స్పృహలోకి రావడమే కాకుండా కాళ్లు చేతులు కూడా కదుపుతున్నాడు. రెప్పలు వేయడం, తలను అటూ ఇటూ తిప్పడం వంటివి కూడా చేస్తున్నాడు. దాంతో వైద్యులు అతడికి వైద్యం అందిస్తున్నారు. దీని గురించి జనాలకు తెలియడంతో అతడి వైద్యానికయ్యే ఖర్చులను ప్రజలు భరిస్తున్నారు. లూయిస్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 

చదవండి: పోస్ట్‌ మార్టం చేస్తుండగా.. భయానక సంఘటన

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు