వచ్చే నెల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌!

9 Oct, 2020 03:58 IST|Sakshi

బ్రిటన్‌ ప్రణాళికలు

లండన్‌: వచ్చే నెల నుంచి దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు బ్రిటన్‌ సమాయత్తమవుతున్నట్లు తాజాగా లీకైన ఎన్‌హెచ్‌ఎస్‌(నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌) డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఐదు వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఆరంభించి క్రిస్‌మస్‌కల్లా పూర్తిస్థాయిలో వీటి ద్వారా రోజూ వేలమందికి టీకాలు అందించాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. లండన్, లీడ్స్‌ తదితర ఐదు చోట్ల ఈ మాస్‌ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి, ముందుగా కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్నవారికి టీకాలను అందిస్తారు. ఐదు ప్రధాన కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచార యూనిట్లను ఏర్పాటు చేసి దేశంలో పత్రి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ పొందేలా చూస్తారని సదరు పత్రాలు వెల్లడించాయి.

అవసరమైతే వ్యాక్సిన్‌ పంపిణీలో మిలటరీ సైతం పాలుపంచుకుంటుందని తెలిసింది. ముందుగా కేర్‌హోమ్‌ వర్కర్లు, కేర్‌హోమ్స్‌లో ఉండే వృద్ధులు, ఆరోగ్యశాఖ వర్కర్లు, 80ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సిన్‌ ఇచ్చి అనంతరం వయసు ఆధారంగా వ్యాక్సినేషన్‌ చేపడతారని జాయింట్‌ కమిటీ ఆన్‌ వ్యాక్సినేషన్‌ గైడ్‌లైన్స్‌ వెల్లడిస్తున్నాయి. ఏడాది చివరకు ప్రయోగదశల్లో ఉన్నవాటిలో కనీసం రెండు వ్యాక్సిన్లైనా అందుబాటులోకి వస్తాయని ఎన్‌ హెచ్‌ఎస్‌ అంచనా వేస్తోంది. వీటిలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సిన్‌పై ఆశలు అధికంగా ఉన్నాయి. క్రిస్‌మస్‌ నాటికి ఈ వ్యాక్సిన్‌కు అన్ని రెగ్యులేటరీ అనుమతులు రావచ్చని అంచనా. ఇప్పటికే ప్రభుత్వం 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఆర్డరు చేసిఉంచింది.

>
మరిన్ని వార్తలు