యూరోకప్‌ టోర్నమెంట్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.10 కోట్లు

14 Jul, 2021 21:01 IST|Sakshi
1 మిలియన్‌ పౌండ్ల లాటరీ టికెట్‌ గెలుచుకున్న యంగ్‌ దంపతులు

లండన్‌: సాధరణంగా చాలా వరకు భార్యాభర్తల్లో ఒకరికి నచ్చినది మరోకరికి నచ్చదు. చాలా మంది భర్తలు స్పోర్ట్స్‌ చానెల్‌ చూడ్డానికి ఇష్టపడతారు.. కానీ భార్యలకేమో ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్స్‌ చూడాలని ఉంటుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయి. అది వేరే విషయం. కానీ ఇప్పుడు మీరు మేం చెప్పబోయే విషయం వింటే.. అబ్బా మాకు ఇలానే జరిగితే ఎంత బాగుటుంది.. అటు గొడవలు ఉండవు.. ఇటు డబ్బులు వస్తాయి అనుకుంటారు. 

ఇంతకు ఏంటా విషయం అంటే కొద్ది రోజుల క్రితం యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ 2020 జరిగిన సంగతి తెలిసిందే. ఇక మన దగ్గర క్రికెట్‌కు ఎంత క్రేజో.. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు అంతకు మించి అభిమానులున్నారు. ఈ క్రమంలో భర్త అస్తమానం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ పెడుతుండటంతో బోర్‌ కొట్టి ఓ మహిళ సరదాకు 1 మిలియన్‌ పౌండ్లు విలువ చేసే లాటరీ టికెట్‌ కొన్నది. అదృష్టం కొద్ది ఆమెనే లాటరీ వరించడంతో ఏకంగా 10 కోట్ల రూపాయలకు పైగా గెలుచుకుంది. ఈ సంఘటన యూకేలో చోటు చేసుకుంది. 

ఆ వివరాలు.. బేసింగ్‌స్టోక్‌కు చెందిన 33 ఏళ్ల సమంతా యంగ్ చార్టెడ్‌ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. ఇక యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ 2020 ప్రారంభమైన నాటి నుంచి భర్త అస్తమానం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ పెడుతుండటంతో బోర్‌గా ఫీలయ్యేది. ఈ క్రమంలో జూలై 3న ఆమె టీవీలో మ్యాచ్‌ చూడటం ఇష్టం లేక ఆన్‌లైన్‌లో బ్రౌజ్‌ చేయసాగింది. దానిలో భాగంగా ఆమెకు ఓ కంపెనీ లాటరీ టికెట్‌ కంటపడింది. ఊరికే టైం పాస్‌కి 20 పౌండ్లు(2,067.69 రూపాయలు) చెల్లించి 1 మిలియన్‌ పౌండ్స్‌ (10,34,97,400 రూపాయలు)విలువ చేసే లాటరీ టికెట్‌ కొన్నది. 

కొద్ది రోజుల తర్వాత యంగ్‌కు ఓ ఈమెయిల్‌ వచ్చింది. ఆమె కొన్న లాటరీ టికెట్‌కే ప్రైజ్‌మనీ వచ్చిందని మెయిల్‌ సారాంశం. ఇది చూసి యంగ్‌ తనకు మహా అయితే 1,000 పౌండ్లు లాటరీ వచ్చాయేమో అని భావించింది. కానీ సరిగా చూస్తే.. దాని విలువ 1 మిలియన్‌ పౌండ్స్‌గా ఉంది. దాంతో భర్తను పిలిచి చూపించింది. అతడు కూడా తన భార్య కొన్న లాటరీ టికెట్‌కు 1 మిలియన్‌ పౌండ్స్‌ ప్రైజ్‌మనీ దక్కిందని తెలిపాడు.

టైం పాస్‌ కాక కొన్న లాటరీ టికెట్‌కు ఇంత భారీ మొత్తం తగలడంతో యంగ్‌ దంపతులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తనకు వచ్చిన మొత్తంతో వారి కలల సౌధం, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్స్‌ కారు కొనడతో పాటు కుటుంబం కోసం కొంత పొదుపు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.  

మరిన్ని వార్తలు