రష్యాపై విజయమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ వార్షిక బడ్జెట్.. పార్లమెంట్‌ ఆమోదం

3 Nov, 2022 20:51 IST|Sakshi

కీవ్‌: రష్యా సైనిక చర్యతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌.. వార్షిక బడ్జెట్‌ను ప్రకటించింది. 2023 ఆర్థిక ఏడాదికి గానూ ప్రవేశపెట్టిన ముసాయిదా పద్దుకు ఆ దేశ పార్లమెంట్‌ గురువారం ఆమోదం ముద్ర వేసింది. ఈసారి రికార్డ్‌ స్థాయిలో 38 బిలియన్‌ డాలర్ల లోటు బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు సీనియర్ పార్లమెంటేరియన్‌ తెలిపారు. ఇది రష్యాపై విజయాన్ని సాధించటమే లక్ష్యంగా తీసుకొచ్చిన బడ్జెట్‌గా పేర్కొన్నారు. మొత్తం 295 మంది సట్టసభ్యులు బడ్జెట్‌కు జై కొట్టారని పార్లమెంట్‌ ఆర్థిక, ట్యాక్స్‌, కస్టమ్స్‌ పాలసీ కమిటీ తొలి డిప్యూటీ ఛైర్మన్‌ యరస్లావ్‌ ఝెలెజ్నాక్‌ టెలిగ్రామ్‌ యాప్‌ వేదికగా వెల్లడించారు. అయితే, ఇతర విషయాలేమీ బయటకు చెప్పలేదు. 

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బడ్జెట్‌ లోటు స్థూల దేశీయోత్పత్తిలో 20.6 శాతంగా ఉంటుదని, 2023లో జీడీపీ వృద్ధి 3.2 శాతంగా ఉండనుందని అంచనా. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 28 శాతంగా ఉండవచ్చని కమిటీ పేర్కొంది. ‘ఇది విజయం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌. ఎందుకంటే 27.08 బిలియన్‌ డాలర్లు సాయుధ దళాలు, దేశ భద్రత కోసమే కేటాయించారు. ఆ తర్వాత పింఛన్లు, ఆరోగ్యం, విద్యారంగానికి అధిక వ్యయాలు ఉన్నాయి.’ అని ప్రధానమంత్రి డేనిస్‌ శ్యామ్‌హాల్‌ తెలిపారు.

ఇదీ చదవండి: ఊహించని ఝలక్‌: రష్యాకు రహస్యంగా ఉత్తరకొరియా ఆయుధ సరఫరా!

మరిన్ని వార్తలు