Russia Ukraine War: ఇదేం ట్విస్ట్‌.. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఊహించని పరిణామం

7 Jun, 2022 16:10 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో మంగళవారం.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీరును తప్పుబడుతూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది ఉక్రెయిన్‌. 

అంతర్జాతీయ అణుశక్తి(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ గ్రాస్సీ దక్షిణ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌కు ప్రతినిధుల బృందాన్ని పంపుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ చర్యలను తప్పుబడుతూ ఉక్రెయిన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఏఈఏకు, ఆ సంస్థ చీఫ్‌కు ఆ ప్లాంట్‌లో అనుమతి లేదంటూ నిషేదాజ్ఞలు జారీ చేసింది ఉక్రెయిన్‌.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ న్యూక్లియర్‌ కంపెనీ ఎనెర్‌గోఆటం.. ఐరాసకు చెందిన అంతర్జాతీయ విభాగం ఐఏఈఏ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. యూరప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్‌ కేంద్రం అయిన  జాపోరిజ్జియా..  దురాక్రమణ నేపథ్యంలో రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రష్యా-ఉక్రెయిన్‌ బలగాలు ఈ ప్లాంట్‌పై ఆధిపత్యం కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఇప్పటికీ ఈ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌ సిబ్బందే నిర్వహిస్తుండడం కొసమెరుపు.

సోమవారం ఐఏఈఏ చీఫ్‌ రఫెల్‌ గ్రాసీ మాట్లాడుతూ.. ఇంటర్నేషనల్‌ మిషన్‌లో భాగంగా నిపుణులతో కూడిన బృందాన్ని రష్యా ఆధీనంలో ఉన్న జాపోరిజ్జియాకు పంపనున్నట్లు ప్రకటించారు. అయితే.. అది రష్యా అనుకూల వ్యాఖ్య, పైగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఐఏఈఏ బృందం ప్లాంట్‌లో పర్యటించడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయి కీవ్‌ వర్గాలు. ఈ క్రమంలో.. ఉక్రెయిన్‌ తీరుపట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు