యుద్ధం నుంచి ఇంటికి తిరిగివచ్చిన మహిళా సోల్జర్‌.. తల్లిని చూసి ఆరేళ్ల కుమారుడి రియాక్షన్ వైరల్‌

20 Jul, 2022 20:34 IST|Sakshi

కీవ్‌: యుద్ధంలో పాల్గొనడమంటే మృత్యువుకు ఎదురెళ్లడమే. కదన రంగంలోకి అడుగుపెట్టాక ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తామనే గ్యారంటీ ఉండదు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు కొన్ని నెలలుగా పోరాడుతున్నారు. ముఖ్యంగా మహిళా సైనికులు తమ బిడ్డలు, కుటుంబాన్ని వదిలి శత్రువులను నిలువరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త శాంతిచడం వల్ల కొందరు తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ ఆరేళ్ల చిన్నారి చాలా రోజుల తర్వాత తన తల్లి ఇంటికి రావడం చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంటి గేటు వద్దే గోడ చాటున ఆమె కోసం ఎదురు చూశాడు. తీరా తల్లిని చూసిన ఆనందంలో ఏం చేయాలో కూడా అతనికి పాలుపోలేదు. తల్లి చిన్నారిని దగ్గరగా హగ్ చేసుకున్న ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు ఆంటోన్ గెరాష్‌చెన్కో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ ఇప్పుడు పోరాడుతోందని దీనికోసమే అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చలించిపోయారు.

ఈ వీడియోలో పెంపుడు కుక్క కూడా చాలా రోజుల తర్వాత మహిళా సోల్జర్‍ను చూసి తెగ సంబరపడిపోయింది. దానికి కూడా ఒక హగ్ ఇవ్వాల్సింది అని ఓ నెటిజెన్ కామెంట్ పెట్టాడు.

మరో వీడియోలో యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తండ్రిని చూపించేందుకు ఓ బాలికను కళ్లు మూసి అతని వద్దకు తీసుకెళ్లింది తల్లి. చాలా రోజుల తర్వాత తండ్రిని చూసిన ఆ పాప భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. తండ్రి కూడా ఆమెను చూసి పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు.


చదవండి: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే!

మరిన్ని వార్తలు