ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు? పుతిన్‌ ప్లాన్‌ బయటకు.. ఆ బిచ్చగాడే మళ్లీ!

3 Mar, 2022 08:34 IST|Sakshi

ఉక్రెయిన్‌ ఆక్రమణ గనుక సక్సెస్‌ అయినా, ఉక్రెయిన్‌ కాళ్ల బేరానికి వచ్చినా.. తాను అనుకున్న ప్లాన్‌ను అమలు చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ నాటోలో చేరకుండా ఉండేందుకు వీలుగా ఆ దేశానికి తమతో స్నేహంగా మెలిగే, నమ్మకమైన వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలనే నిర్ణయానికి పుతిన్ వచ్చినట్లు భోగట్టా. 

ఏది ఏమైనా.. రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిజ్ఞ చేయడం తెలిసిందే. ఈ తరుణంలో జెలెన్‌స్కీని గద్దె దించి(అవసరమైతే బలగాలతో హతమార్చి!).. తదుపరి అధ్యక్షుడిగా విక్టర్ యనుకోవిచ్‌ను ప్రకటించాలని పుతిన్ యోచిస్తున్నట్లు ది కీవ్‌ ఇండిపెండెంట్‌ ఒక కథనం ప్రచురించింది. ఉక్రెయిన్‌ మాజీ అధ్యక్షుడైన విక్టర్ యనుకోవిచ్.. ప్రస్తుతం రష్యా ఆశ్రయంలో ఉన్నాడు. 2010లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన యనుకోవిచ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు వెల్లువెత్తడంతో రష్యాకు పారిపోయాడు. ప్రస్తుతం యనుకోవిచ్‌ను బెలారస్‌ రాజధాని  మిన్స్క్ లో దించాడు పుతిన్‌. దీంతో ఇవాళ చర్చల సందర్భంగా యనుకోవిచ్‌ను అధ్యక్షుడిని చేసే ప్రతిపాదన సైతం ఉంచుతారనే వాదన వినిపిస్తోంది.

అప్పుడు.. ఇప్పుడు రష్యాకి అనుకూలుడే!
యనుకోవిచ్‌1997 నుండి 2002 వరకు తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ఒబ్లాస్ట్‌కు గవర్నర్‌గా విధులు నిర్వర్తించాడు. అటుపై యనుకోవిచ్‌ 2006 నుండి 2007 వరకు 2005కి ముందు కొద్ది కాలం పాటు దేశ ప్రధాన మంత్రిగా పని చేశాడు. 2010లో ఉక్రెయిన్‌కు నాల్గవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2013లో  Viktor Yanukovych అధికారంలో ఉండగా.. రష్యాతో సన్నిహిత సంబంధాలను కోరుతూ యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ వ్యాప్తంగా ప్రదర్శనలు చెలరేగాయి. యనుకోవిచ్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి పుతిన్ చేసిన ఫలితాలు కాస్త ఉంటే ఫలించేవే. కానీ, యనుకోవిచ్‌ కీవ్‌ నుంచి ఖార్కివ్‌కు పారిపోవడంతో చివర్లో బెడిసి కొట్టింది. 

2013 నవంబర్‌ నుంచి నెలన్నరపాటు యూరోమెయిడాన్‌ నిరసనలు, ఆ వెంటనే మెయిడాన్‌ నిరసనలతో ఉక్రెయిన్‌ అట్టుడికి పోయింది. నిరసనకాలకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఆపై గద్దె దిగిపోయిన యనుకోవిచ్‌ క్రెమ్లిన్‌ సంరక్షణలో ఉంటున్నాడు. యనుకోవిచ్‌ పారిపోయిన రోజున.. ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ అతని తొలగింపునకు ఓటింగ్‌ నిర్వహించింది. అయితే ఇది అన్యాయమంటూ యనుకోవిచ్‌, అతని మద్ధతుగా రష్యా ప్రకటన విడుదల చేశాయి. 

యనుకోవిచ్‌ నేపథ్యం.. 
సోవియట్‌ యూనియన్‌ తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలో జన్మించాడు యనుకోవిచ్‌. రెండేళ్ల వయసులో తల్లిని పొగొట్టుకుని.. తండ్రి పట్టించుకోకపోవడంతో రోడ్డు పాలయ్యాడు. వీధుల వెంట అడుక్కుని తిరుగుతూ జీవనం కొనసాగించానని, ఆకలితో విలవిలలాడిపోయానని, తన బాల్యం ఎంతో ఘోరంగా గడిచిందంటూ తరచూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటాడు యనుకోవిచ్‌. అనూహ్యంగా జీవితం మలుపు తిరగడంతో(అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఉక్రెయిన్ మీడియా ఇప్పటికీ ఆరోపిస్తుంటుంది) వ్యాపారవేత్తగా, ఆపై రాజకీయాలతో రాణించి క్రమక్రమంగా ఎదిగాడు. పదిహేడేళ్ల వయసులో దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన యనుకోవిచ్‌..  అధికారంలోకి వచ్చిన యువత నేర ప్రవృత్తి చట్టాల మార్పునకు ప్రయత్నించాడు.  

అయితే పలు ఆరోపణల మధ్య వివాదాస్పద ఎన్నికలలో 2004లో మొదటిసారి అధ్యక్ష పదవికి పోటీ చేశాడు. ఉక్రెయిన్ సుప్రీం కోర్ట్ ఫలితాలను రద్దు చేయడానికి, మళ్లీ ఎన్నికలు పెట్టాలని ఆదేశించడంతో ఉక్రెయిన్‌లో ‘ఆరెంజ్ విప్లవం’ మొదలైంది. యనుకోవిచ్ రెండో ఎన్నికల్లో యుష్చెంకో చేతిలో ఓడిపోయాడు. నిరసనకారులు యనుకోవిచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పటికీ, EU-ఉక్రెయిన్ అసోసియేషన్ ఒప్పందంపై సంతకం చేయడానికి యనుకోవిచ్ నిరాకరించడంతో నవంబర్ 2013లో కైవ్‌లోని ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. కైవ్‌లోని మైదాన్ వద్ద జరిగిన ప్రధాన ప్రదర్శనతో నిరసనకారులు ఉక్రెయిన్‌లో పోలీసులతో హింసాత్మకంగా ఘర్షణ పడ్డారు. నిరసనలు ప్రధానంగా సెంట్రల్ కైవ్‌లోని మైదాన్ నెజాలెజ్నోస్టిలో జరిగాయి. ఇది యనుకోవిచ్ వ్యతిరేక నిరసనలకు ర్యాలీ పాయింట్‌గా మారింది. యనుకోవిచ్ దేశం విడిచి పారిపోవడంతో నిరసనకారులు చివరకు శాంతించారు. ఆపై ప్రదర్శనకారులు అధ్యక్ష పరిపాలన, అతని ప్రైవేట్ ఎస్టేట్‌పై నియంత్రణ సాధించారు.

రష్యా రాజకీయాల్లోనూ జోక్యం
పెట్రో పోరోషెంకో తర్వాత ఒలెక్సాండర్ తుర్చినోవ్ అధికారంలోకి రావడంతో యనుకోవిచ్ దేశం విడిచిపెట్టాల్సి వచ్చింది. పాత కేసులు తిరగదోడతారనే భయంతో రష్యా శరణార్థిగా ఉంటున్నాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ తర్వాత.. ఏదో ఒక రోజు యనుకోవిచ్‌ని ఉక్రెయిన్‌ గద్దెపై మళ్లీ కూర్చోబెడ్తా అంటూ పుతిన్‌ వ్యాఖ్యానించడం విశేషం‌. అప్పటి నుంచి రష్యా ఆర్థిక వ్యవస్థలో, పాలనపరమైన విషయాల్లోనూ యనుకోవిచ్‌ జోక్యం చేసుకుంటూ వస్తున్నాడు. యనుకోవిచ్‌ నిర్ణయాలకు పుతిన్‌ గౌరవం ఇస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో హాస్యనటుడు జెలెన్‌స్కీ Zelensky 2019లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ఉక్రెయిన్‌ను యూరోపియన్ యూనియన్, నాటోలో చేరే దిశగా జెలెన్‌స్కీ ప్రయత్నాలు పుతిన్‌కు నచ్చకపోవడం, అది ఇప్పడు యుద్ధానికి దారి తీయడం తెలిసిందే కదా!.

మరిన్ని వార్తలు