Putin News: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో పెను సంచలనం.. పుతిన్‌పై హత్యాయత్నం..! డ్రోన్లతో ఇంటిపై దాడి..

3 May, 2023 18:11 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను హత్య చేసేందుకు జెలెన్‌స్కీ కుట్ర చేశారని తెలిపింది. మాస్కోలోని పుతిన్  అధికారిక నివాసంపై ఉక్రెయిన్‌కు చెందిన రెండు డ్రోన్లు దాడి చేసినట్లు పేర్కొంది.  ఈ డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్లు వెల్లడించింది. దీన్ని ఉగ్ర చర్యగా అభివర్ణించింది.

'రెండు మానవ రహిత డ్రోన్లు పుతిన్‌ నివాసంపై దాడికి ప్రయత్నించాయి. రాడార్ వ్యవస్థను ఉపయోగించి రష్యా సైన్యం వాటిని కూల్చివేసింది. దీన్ని ఉగ్ర కుట్రగా మేం భావిస్తున్నాం. విక్టరీ డే సందర్భంగా విదేశీ ప్రతినిధులతో మే 9న మేము నిర్వహించే పరేడ్‌ను లక్ష‍్యంగా చేసుకుని ఈ దాడికి ఉక్రెయిన్ కుట్ర చేసింది. రష్యా బలగాలు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి. శత్రువులు ఏ రూపంలో వచ్చినా దీటుగా బదులిస్తాయి.' అని రష్యా ప్రకటనలో తెలిపింది.

ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడిలో పుతిన్‌కు ఎలాంటి హాని జరగలేదని, భవనాలు కూడా దెబ్బతినలేదని రష్యా తెలిపింది. డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.  మాస్కోలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో మృతదేహం..

మరిన్ని వార్తలు