Ukraine Russia War: ఉక్రెయిన్‌కు కోలుకోలేని దెబ్బ.. యుద్ధం ఆగినా కష్టమే! రష్యాపైనా భారం?

11 Mar, 2022 18:59 IST|Sakshi

Russia-Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు దేశాల్లో ఎవరూ తగ్గకపోవడంతో యుద్ధ విధ్వంసం ఆగడం లేదు. దీంతో యుద్ధం మొదలై 16 రోజులవుతున్నా ఎప్పుడు ఆగుతుందో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది.  కాగా రష్యా బలగాల దాడిలో ఉక్రెయిన్‌లో భారీగా నష్టం వాటిల్లినట్లు ఆ దేశ  అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముఖ్య ఆర్థిక సలహాదారు ఒలేగ్ ఉస్టెంకో వెల్లడించారు. గత 15 రోజుల్లో రష్యా భీకర పోరు కారణంగా సుమారు100 బిలియన్‌ డాలర్లు ( సుమారు 7.6 లక్షల కోట్లు) నష్టం వాటిల్లిందని తెలిపారు. 

మాస్కో క్షిపణి దాడుల్లో భవనాలు, మౌలిక సదుపాయాలు, ఇతర భౌతిక ఆస్తులు ధ్వంసమైనట్లు తెలిపారు. తాను వెల్లడించిన అంచనాల కంటే వాస్తవ నష్టం ఇంకా ఎక్కువే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో 50 శాతానికి పైగా వాణిజ్య కార్యకలాపాలను మూసేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన వాణిజ్య కార్యాకలాపాలు సైతం నెమ్మదించినట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా ఆర్థికాభివృద్ధి మాత్రం సాధ్యపడదని ఒలేగ్ తెలిపారు. ఇక ఆయుధాల సరఫరా, సైన్యం ఖర్చులు, బాంబుల తయారీ వంటి ఇతరత్రా ఖర్చులతో రష్యాపైనా పెద్ద ఎత్తున ఆర్ధిక భారం తప్పలేదన్నారు.
చదవండి: రష్యా దాడి: కుటుంబాన్ని కాపాడుకోవాలని ఎంతో చేశాడు.. చివరికి ఒక్కడే మిగిలాడు!

రష్యా నుంచే వసూలు
సుమీ, మారియుపోల్‌ తదితర ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముఖ్య ఆర్థిక సలహాదారు ఒలేగ్ ఉస్టెంకో తెలిపారు. మానవతా కారిడార్ల ఏర్పాటుకు సహకరించడం లేదని చెప్పారు. అయితే రష్యా నుంచే ఖర్చు వసూలు చేస్తామని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి 25 లక్షల మంది పౌరులు దేశం విడిచి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. రష్యా దాడి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 78 మంది చిన్నారులు చనిపోయారని ఉక్రెయిన్ పేర్కొంది.  
చదవండి: ఇద్దరు పిల్లల సాక్షిగా నిజమే చెబుతున్నా: జెలెన్‌ స్కీ

కాల్పుల విరమణపై కుదరని అంగీకారం
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఆపేందుకు టర్కీలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో ఈసారీ ఎలాంటి ఫలితం తేలలేదు. కాల్పుల విరమణ, మానవతా కారిడార్లపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌తో గురువారం టర్కీలో చర్చించామని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా తెలిపారు. కాల్పుల విరమణపై 24 గంటలకు పైగా చర్చించామని, కానీ ఎలాంటి పురోగతి లేదని అన్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి రష్యాలో వేరే అధికారులున్నారని తెలుస్తోందన్నారు. వాళ్లు ఉక్రెయిన్‌ లొంగిపోవాలని అంటున్నారని, ఇది జరగబోదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు