భారత్‌తో సంబంధాలపై ఉక్రెయిన్‌ ప్రభావం లేదు

5 Feb, 2022 06:06 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌తో తమ సంబంధాలపై రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల ప్రభావం ఉండబోదని అమెరికా స్పష్టం చేసింది. ద్వైపాక్షికాంశాలు మాత్రమే ఇరు దేశాల సంబంధాలకు ప్రాతిపదికగా ఉంటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గత సోమవారం చేపట్టిన ప్రొసీజరల్‌ ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉండటం తెలిసిందే.

ఈ నిర్ణయం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపిందా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన నేరుగా బదులివ్వలేదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దూకుడుకు సంబంధించి భారత్‌తో పాటు డజన్ల కొద్ది దేశాలతో ఎప్పటికప్పుడు పలు స్థాయిల్లో మాట్లాడుతున్నట్టు చెప్పారు. వాటి మధ్య యుద్ధమే జరిగితే దాని ప్రభావం భారత్‌తో పాటు అన్ని దేశాలపైనా ఉంటుందన్నారు. ఉక్రెయిన్‌–రష్యా వివాదం కొంతకాలంగా అంతర్జాతీయంగా నలుగుతున్న విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సర్వసన్నద్ధంగా ఉందని, కనీసం లక్షకు పైగా బలగాలను సరిహద్దుల సమీపానికి తరలించిందని అమెరికా, యూరప్‌ దేశాలు ఆరోపిస్తున్నాయి. దాన్ని తక్షణం సరిహద్దుల నుంచి ఉపసంహరించాలని, కాదని ఉక్రెయిన్‌పై దాడికి దిగితే భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరిస్తున్నాయి. ఉక్రెయిన్‌ తమతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ గౌరవించాలని, ఆ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వొద్దని రష్యా డిమాండ్‌ చేస్తోంది. వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ ఉద్దేశమని చెబుతూ భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది.

రంగంలోకి జర్మనీ, ఫ్రాన్స్‌
బెర్లిన్‌: ఉద్రిక్తతలను తగ్గించేందుకు త్వరలో రష్యా, ఉక్రెయిన్లలో పర్యటించాలని జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రన్‌ నిర్ణయించారు. మాక్రన్‌ సోమవారం మాస్కో, మంగళవారం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వెళ్లనున్నారు. స్కోల్జ్‌ 14న కీవ్, 15న మాస్కోలో పర్యటిస్తారు. నాటో సభ్య దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌ ఉన్నట్టుండి తీసుకున్న ఈ నిర్ణయాలపై అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ కూడా తాజాగా ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారు. 

మరిన్ని వార్తలు