ర‌ష్యాపై దాడి మొదలుపెట్టిన ఉక్రెయిన్.. చ‌మురు డిపో ధ్వంసం

1 Apr, 2022 20:33 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం శుక్రవారంతో 37వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్‌, మారియుపోల్‌ వంటి కీలక నగరాలపై రష్యా బాంబు దాడులు ​జరుపుతోంది. ఈ యుద్ధంలో రెండు దేశాల సైన్యంతో పాటు వేలాది పౌరులు అన్యాయంగా బలైపోతున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అయితే రష్యా కుతంత్రాలకు పాల్పడుతున్నదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా దురాక్రమణనుంచి తన దేశాన్నిన రక్షించుకోవడం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఆయన  తెలిపారు. 

రష్యా దాడులకు ప్రతిస్పందనగా, ఉక్రెయిన్ సైన్యం తొలిసారి రష్యాపై దాడికి దిగింది. రష్యా భూభాగంలోని పశ్చిమ బెల్గోరోడ్ నగరంలోని చమురు డిపోపై ఉక్రెయిన్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు వైమానిక దాడి చేశాయని రష్యన్‌ అధికారులు శుక్రవారం తెలిపారు. ఉక్రెయిన్‌ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్గోరోడ్‌లో శుక్రవారం ఉదయం ఈ బాంబు దాడి ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. వైమానిక దాడితో భారీగా మంటలు వ్యాపించాయని, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలిపారు. 170 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేసినట్లు చెప్పారు. సిబ్బందిని అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయించినట్లు రష్యా మంత్రిత్వశాఖ పేర్కొంది.
చదవండి: Pakistan PM: ఓ పవర్‌ఫుల్‌ దేశం భారత్‌కు అండగా ఉంది..

అయితే ఈ ఘటన రష్యా  ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలకు ఆటంకం కలిగించవచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. చమురు డిపోపై  దాడి.. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని తీవ్రతరం  చేయవచ్చనే  అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇదిలా ఉండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌లతో సమావేశమయ్యారు. 
చదవండి: Putin: మొండి పుతిన్‌కు పెరిగిన మద్దతు.. ఆదరణ!

మరిన్ని వార్తలు