ఉక్రెయిన్‌ దాడి.. ఆకాశంలో రష్యా హెలికాప్టర్‌ రెండు ముక్కలు.. వీడియో వైరల్‌

4 Apr, 2022 16:27 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా మొదలెట్టిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతోంది. అయితే మొదట్లో రష్యా దాడిని అడ్డుకుంటూ వచ్చిన ఉక్రెయిన్ ఆర్మీ గత రెండు వారాలుగా ఎదురు దాడులు చేస్తోంది. పేరుకి చిన్న దేశం, ఆయుధ సంపత్తి, సైన్యం పరంగా రష్యాతో సమఉజ్జీ కాకపోయినా ధీటుగా నిలబడి ఉక్రెయిన్‌ పోరాడుతోంది. తాజాగా ర‌ష్యాకు చెందిన ఎంఐ-28 హెలికాప్టర్‌ను ఉక్రెయిన్‌ సైన్యం రెండు ముక్కలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దర్శనమిస్తోంది.

ఉక్రెయిన్ సైనికులు స్టార్‌ స్ట్రీక్‌ అనే మిస్సైల్‌తో దాడి చేయగా రష్యా ఎంఐ28 హెలికాప్ట‌ర్‌కు చెందిన టెయిల్‌ పార్ట్‌ ధ్వంసం కావడంతో రెండుగా విడిపోయి కుప్పకూలింది. లుహ‌న్స్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. స్టార్‌స్ట్రీక్ మిస్సైల్‌ యూకే అత్యంత అధునాతన మానవసహిత పోర్టబుల్ క్షిపణి వ్యవస్థ. ఇది తక్కువ ఎత్తు ఎగిరే శత్రు జెట్‌లను పడగొట్టడానికి, హెలికాప్టర్‌లపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు.

స్టార్ స్ట్రీక్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇది ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం సహాయంతో గాల్లో ఎగిరే టార్గెట్‌లను సునాయాసంగా పేల్చేయవచ్చు. ఉక్రెయిన్‌కు 6,000 క్షిపణుల కొత్త ప్యాకేజీతో సహా మరింత రక్షణాత్మక మద్దతును అందిస్తుందని బ్రిటన ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు. ప్రస్తుతం రష్యా దళాలు తాజాగా తూర్పు ఉక్రెయిన్ వైపు దృష్టి సారించాయి.

చదవండి: Russia Ukraine War: రష్యా అకృత్యాలు.. మాటలు రావడం లేదు! ఈ ఒక్క ఫొటో చాలు

మరిన్ని వార్తలు