ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం

28 Apr, 2023 06:16 IST|Sakshi

కీవ్‌: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్‌ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ చెప్పారు.

అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్‌ బ్రిగేడ్‌లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్‌ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్‌ క్రూయిజ్‌ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్‌ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. 

మరిన్ని వార్తలు