రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే నాటికి పుతిన్ అవుట్‌!

30 Oct, 2022 13:24 IST|Sakshi

కీవ్‌: రష్యాతో యుద్ధం ముగిసేనాటికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదవిలో ఉండరని చెప్పారు ఉక్రెయిన్ రక్షణ అధికారి కిరిలో బుడనోవ్. పుతిన్‌ను అధ్యక్షుడిగా తొలిగించేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే పుతిన్ పదవిని కోల్పోతారని జోస్యం చెప్పారు.

యుద్ధం మొదలైన తొలినాళ్లలో రష్యా ఆక్రమించుకున్న ఖేర్సాన్‌ను ఉక్రెయిన్ తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. నవంబర్ నాటికి ఈ ప్రాంతమంతా మళ్లీ తమ అధీనంలోకి వస్తుందని బుడనోవ్ పేర్కొన్నారు. ఆ తర్వాత క్రిమియాను కూడా తిరిగి పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని రష్యా 2014లోనే తమ భూభాగంలో విలీనం చేసుకుంది.

సెప్టెంబర్ నుంచి రష్యా సేనలను చావుదెబ్బ కొడుతూ తమ ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటోంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలోనే పుతిన్ పదవి కోల్పోతారని బుడనోవ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉక్రెయిన్ దాడులకు ప్రతిఘటనగా ఇటీవల డ్రోన్లతో క్షిపణుల వర్షం కురిపించింది రష్యా. విద్యుత్ కేంద్రంపై బాంబులతో విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్లో 40 శాతం మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లారు. అయినా ఏమాత్రం వెనక్కితగ్గకుండా రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నాయి కీవ్ సేనలు. తమ ప్రాంతాలని తిరిగి చేజిక్కించుకుంటున్నాయి.
చదవండి: షాకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. కీలక రహస్యాలు లీక్‌!

మరిన్ని వార్తలు