సమయం మించిపోతోంది.. కొత్త ఆయుధాలు కావాలి.. త్వరగా ఇవ్వండి

30 Jan, 2023 17:46 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్ తూర్పు డొనెస్క్ ప్రాంతంలో రష్యా తరచూ దాడులు చేస్తోందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. తాము అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. రష్యాను దీటుగా ఎదుర్కోవాలంటే తమకు సరికొత్త ఆయుధాలు కావాలని, ప్రపంచ దేశాలు వేగంగా వాటిని తమకు అందించాలని కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం వీడియో సందేశం విడుదల చేశారు.

డొనెస్క్‌లోని బాఖ్‌ముత్, వుహ్లెడార్‌తో పాటు ఇతర చోట్ల రష్యా తరచూ భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ సేనలను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. రష్యా ఈ యుద్ధాన్ని ఇంకా సాగదీయాలని చూస్తోందని, అందుకే సమయాన్ని ఆయుధంగా మార్చుకుని శత్రు దేశాన్ని చావుదెబ్బతీయాలని జెలెన్‌స్కీ చెప్పారు. అత్యంత వేగంగా తమకు అధునాతన ఆయుధాలు సమకూర్చాలన్నారు.

డొనెస్క్‌లోని బ్లాహొదాట్నే ప్రాంతంపై రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఆదివారం ఉదయమే వెల్లడించారు. రష్యా మాత్రం ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించింది.

అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికా తయారు చేసిన ఏటీఎసీఎంస్ క్షిపణులను తమకు ఇవ్వాలని జెలెన్‌స్కీ కోరుతున్నారు. 300 కీలోమీటర్ల దూరంలోని లక్ష‍్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అయితే ఈ క్షిపణులను ఉక్రెయిన్‌ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తోంది.
చదవండి: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు