జెలెన్‌ స్కీ ఆవేదన.. తమ జీవితాల​కు, స్వేచ్చకు మద్దతివ్వండి అంటూ..

24 Mar, 2022 12:05 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు (ఫిబ్రవరి 24న) మొదలై నేటికి మార్చి 24 నాటికి నెల రోజులు పూర్తైంది. దాడుల కారణంగా ఉక్రెయిన్‌ విలవిల్లాడుతోంది. ప్రపంచ దేశాలు తమ వంతు సాయంగా ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తున్నప్పటికీ దాడుల తీవ్రత కారణంగా భారీగా నష్టపోయింది. మరోవైపు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా పుతిన్‌ మాత్రం దాడులను ఆపడం లేదు. 

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రపంచ దేశాల ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తాను మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ దేశంపై రష్యా దాడికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులు వీధుల్లోకి రావాలని జెలెన్‌ స్కీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి, స్వేచ్ఛకు మద్దతు ఇవ్వడానికి, తమ జీవితాలకు మద్దతు ఇవ్వడానికి ఉక్రేనియన్ దేశ జెండాలను చేతపట్టుకొని శాంతి కోసం పోరాడాలని సూచించారు. 

ప్రతీ ఒక్కరూ ఉక్రెయిన్‌లో శాంతి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, స్కూల్స్‌, యూనివర్సీటీలు, ఆఫీసుల నుంచి శాంతి ర్యాలీలు తీయాలని పేర్కొన్నారు. రష్యా రక్తపాత యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని ఉద్వేగంగా ప్రసంగించారు. అయితే, బ్రస్సెల్స్‌లో నాటో శిఖరాగ్ర సమావేశానికి కొన్ని గంటల ముందు జెలెన్‌ స్కీ ఈ వీడియోను విడుదల చేశారు.

చర్చల్లో పురోగతి..
ఇదిలా ఉండగా.. రష్యాతో శాంతి చర్చల్లో కొంత పురోగతి ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ వెల్లడించారు. పలు కీలకాంశాలపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం దిశగా పరిస్థితులు సాగుతున్నాయని తెలిపారు. కాగా, పశ్చిమ దేశాలు మాత్రం రష్యా దిగొస్తున్న సూచనలేవీ ఇప్పటిదాకా కన్పించడం లేదంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు