Russia Ukraine War: పారిపోండి.. చస్తారు! రష్యా బలగాలకు జెలెన్‌స్కీ సాలిడ్‌ వార్నింగ్‌.. ఖేర్‌సన్‌లో మిస్సైళ్ల వాన

30 Aug, 2022 16:39 IST|Sakshi

రష్యాలో యుద్ధంలో ఉక్రెయిన్‌ దూకుడు చూపిస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌ సైన్యం చేష్టలతో రష్యా బలగాలు వణికిపోతున్నాయి. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతం ఖేర్‌సన్‌లో మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. గత రెండు రోజుల్లోనే పదిహేను క్షిపణులతో దాడి చేసింది ఉక్రెయిన్‌. ఈ దెబ్బతో రష్యా బలగాలు.. ట్రూపులు లెక్కన వెనక్కి మళ్లుతున్నాయి. దాడి విషయాన్ని అటు రష్యా సైన్యం సైతం ధృవీకరించడం గమనార్హం. 

ఖేర్‌సన్‌ నుంచి వెనక్కి వెళ్లిపోండి. లేకుంటే ప్రాణాలు పోతాయ్‌ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌కు దిగాడు. దాదాపు మొత్తం ప్రాంతం అంతటా పోరు సాగింది. బతకాలనుకుంటే.. ఈసారికి రష్యా బలగాలు పారిపోవడం తప్ప మరో మార్గం లేదు. పారిపోండి.. ఉక్రెయిన్‌ తన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది’’ అంటూ రష్యా బలగాలను ఉద్దేశించి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు జెలెన్‌స్కీ.  అంతేకాదు.. ఉక్రేనియన్ దళాలు రష్యన్ సైన్యాన్ని ‘సరిహద్దు వరకు’ తరిమివేస్తాయంటూ సోమవారం అర్ధరాత్రి తర్వాత చేసిన ప్రసంగంలో ప్రతినబూనారు జెలెన్‌స్కీ. 

ఆరు నెలల కిందట రష్యా దురాక్రమణ మొదలయ్యాక.. మొదటగా ఆక్రమించుకుంది ఖేర్‌సన్‌ ప్రాంతన్నే. నల్ల సముద్రం(బ్లాక్‌ సీ) సరిహద్దుగా ఉండే ఈ ప్రాంతం ద్వారా సముద్రయానంతో పాటు ఉక్రెయిన్‌కు వరక్త, వాణిజ్యాలు ప్రధానంగా సాగుతుంటాయి. రష్యా ఆక్రమిత క్రిమియాకు 60 మైళ్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం.

మరోవైపు ఖేర్‌సన్‌ ప్రాంతంలో రష్యా వ్యవహారాలను చూసుకుంటున్న వ్లాదిమిర్‌ లియోన్‌టీవ్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలిపారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వరుసగా మిస్సైళ్ల వర్షం కురుస్తోంది ఇక్కడ. రెండు రోజుల్లో పదిహేను క్షిపణి దాడులు జరగ్గా.. ఆరు నెలల్లో ఇప్పటివరకు ఖేర్‌సన్‌ను వంద మిస్సైళ్లకు పైగా తాకినట్లు  లియోన్‌టీవ్‌ ప్రకటించారు. ఇక రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ సైతం జెలెన్‌స్కీ పిలుపుపై స్పందించింది. ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌ కొనసాగుతుందని, అన్నీ సక్రమంగా జరుగుతాయని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తెలిపారు. అయితే రష్యా బలగాలు వెన్నుచూపుతున్నాయన్న ప్రకటనను మాత్రం ఖండించింది క్రెమ్లిన్‌.    

ఇదీ చదవండి: బాగ్దాద్‌ రణరంగం

మరిన్ని వార్తలు