మారణ హోమం మళ్లీ మొదలైంది.. కావాలనే చేసిన ‘ఉగ్రదాడి’: జెలెన్‌స్కీ

28 Jun, 2022 09:48 IST|Sakshi

కీవ్‌: ఐదు నెలల తర్వాత.. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా బలగాలు మళ్లీ మారణహోమానికి పాల్పడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ మాల్‌పై రష్యా క్షిపణి దాడుల్లో 16 మంది మృతి చెందారు. సుమారు 59 మందికి గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ‘యూరోపియన్ చరిత్రలో ఉగ్రవాదులు(రష్యా, బెలారస్‌ సైన్యాన్ని ఉద్దేశించి..) ఏమాత్రం జంకు లేకుండా కొనసాగించిన దాడి’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

క్రెమెంచుక్‌ నగరంలో రద్దీగా ఉన్న ఓ మాల్‌పై సోమవారం రష్యన్‌ బలగాలు క్షిపణులతో దాడి చేశాయి. ఘటన జరిగిన వెంటనే.. అత్యవసర బలగాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అక్కడికక్కడే 16 మంది చనిపోయారు. 59 మందికి గాయాలుకాగా.. 25 మంది ఆస్పత్రిలో చేర్పించారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

గగనతలం దాడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలను ఉక్రెయిన్‌ పెడచెవిన పెడుతుండడంతో.. నష్టం జరుగుతోంది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని జెలెన్‌స్కీకి నాటో  యుద్ధ నిపుణులు సూచిస్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఉగ్రదాడులకు పాల్పడుతున్నారంటూ జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

చదవండి: నామరూపాల్లేకుండా ఉక్రెయిన్ నగరాలు

మరిన్ని వార్తలు