రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం

23 Mar, 2022 03:12 IST|Sakshi
చెర్నిహివ్‌లో రష్యా దాడులతో దెబ్బతిన్న చమురు ట్యాంకుల నుంచి వెలువడుతున్న పొగలు 

రష్యాను నిలువరిస్తున్న ఉక్రెయిన్‌

సైన్యాన్ని తరిమి కీలక ప్రాంతం స్వాధీనం

అన్ని నగరాల్లోనూ రష్యాకు తీవ్ర ప్రతిఘటన

మెరుపుదాడులతో బెంబేలెత్తిస్తున్న ఉక్రెయిన్‌

మారియుపోల్‌లో రష్యా గస్తీ పడవ ధ్వంసం

ఈ ప్రతిఘటన పుతిన్‌ ఊహించలేదు: అమెరికా

రష్యా గెలుపు అసాధ్యం: గుటెరస్‌ 

కీవ్‌: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం. దాదాపు నెల రోజుల యుద్ధంలో ప్రధానంగా ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్‌ తాజాగా రష్యా దళాలపై ఎదురుదాడికి దిగుతోంది! మంగళవారం హోరాహోరీ పోరులో రాజధాని కీవ్‌ శివార్లలో వ్యూహాత్మకంగా కీలకమైన మకరీవ్‌ నుంచి రష్యా సేనలను వెనక్కు తరిమి దాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో కీలకమైన స్థానిక హైవేపై ఉక్రెయిన్‌ సైన్యానికి తిరిగి పట్టు చిక్కింది.

వాయవ్య దిక్కు నుంచి కీవ్‌ను చుట్టముట్టకుండా రష్యా సైన్యాన్ని అడ్డుకునే వెసులుబాటు కూడా దొరికింది. అయితే బుచా, హోస్టొమెల్, ఇర్పిన్‌ తదితర శివారు ప్రాంతాలను మాత్రం రష్యా సైన్యం కొంతమేరకు ఆక్రమించగలిగిందని ఉక్రెయిన్‌ రక్షణ శాఖ పేర్కొంది. ఎలాగోలా కీవ్‌ను చేజిక్కించుకునేందుకు యుద్ధం మొదలైనప్పటి నుంచీ రష్యా విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం కూడా బాంబు, క్షిపణి దాడులతో కీవ్, శివార్లు, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూను బుధవారం దాకా పొడిగించారు. 

మారియుపోల్‌లో వినాశనం 
కీలక రేవు పట్టణం మరియుపోల్‌లో రష్యా గస్తీ బోటును, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది. నగరాన్ని ఆక్రమించేందుకు రష్యా సైన్యాలు చేస్తున్న ప్రయత్నాలను నిరంతరం తిప్పికొడుతున్నట్టు చెప్పింది. నగర వీధుల్లో శవాలు గుట్టలుగా పడున్నాయని నగరం నుంచి బయటపడ్డ వాళ్లు చెప్తున్నారు. మారియుపోల్‌లోనే కనీసం 10 వేల మందికి పైగా పౌరులు మరణించి ఉంటారని భావిస్తున్నారు! మూడో వంతుకు పైగా ప్రజలు ఇప్పటికే నగరం వదిలి పారిపోయారు.

ప్రధానంగా నగరాలే లక్ష్యంగా రష్యా సేనలు వైమానిక, భూతల దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. అయితే రష్యా సేనలకు ఎక్కడికక్కడ తీవ్ర ప్రతిఘటనే ఎదురవుతోంది. ఉక్రెయిన్‌ సేనలు మెరుపుదాడులతో వాటిని నిలువరిస్తున్నాయి. యుద్ధం వల్ల ఇప్పటికే కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. దేశ జనాభాలో ఇది దాదాపు నాలుగో వంతు. వీరిలో కనీసం 40 లక్షలకు పైగా దేశం వీడారు.

యుద్ధాన్ని నివారించేందుకు తమతో కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కోరారు. తాజా పరిస్థితిపై నేతలిద్దరూ ఫోన్లో చర్చించారు. రష్యా గెలుపు అసాధ్యమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. ఈ సమస్యకు చర్చలతో మాత్రమే పరిష్కారం సాధ్యమన్నారు. ఉక్రేనియన్లు నరకం చవిచూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.  

రష్యా గ్యాస్‌ వదులుకోలేం: జర్మనీ 
రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకోలేమని జర్మనీ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని జర్మనీ చాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ మంగళవారం చెప్పారు. పలు యూరప్‌ దేశాలు రష్యా గ్యాస్‌పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. తమ ఇంధన అవసరాలను ఇతర మార్గాల్లో తీర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశామని చెప్పారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో కలిసి రష్యాను కఠినాతి కఠినమైన ఆంక్షలతో ఇప్పటికే కుంగదీస్తున్నామని గుర్తు చేశారు. జర్మనీ గ్యాస్‌ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు