ఉక్రేనియన్ల దీనావస్థ.. కనీసం బస్‌స్టేషన్‌ పేరుకూడా అర్థం కావడం లేదు!

22 Mar, 2022 11:09 IST|Sakshi

ఉక్రెయిన్‌లో రష్యా విధ్వసం కొనసాగుతోంది. యుద్ధం మొదలై నాలుగు వారాలు పూర్తవుతున్నా.. ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలైన కీవ్‌, మరియూపోల్‌పై రష్యా సైన్యం విరుచుపడుతోంది. అయితే ఉక్రెయిన్‌ నాటో సభ్యత్వాన్ని కోరదనే విషయంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అయితే దానికి బదులుగా ఉక్రెయిన్‌ భద్రత దృష్యా రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, తమ దళాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. అదే విధంగా రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మరియూపోల్‌లో 400 మంది ఆశ్రయం పొందుతున్న ని ఓ పాఠశాలపై బాంబులతో దాడికి తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యుద్ధం కారణంగా లక్షలాది మంది ఇతర దేశాలకు వలసలు వెళుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. వీరిలో సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు చేరారు. కాగా  కాగా సగటు ఉక్రేనియన్లు తమ భాష తప్ప మరోటి మాట్లాడరు. చాలా తక్కువ మంది ఇంగ్లిష్‌ అర్థం చేసుకుంటారు. మాట్లాడే వారైతే మరీ తక్కువ. స్థానికులకు కూడా చాలావరకు అటు ఇంగ్లిష్, వీరి భాష రావు. దాంతో పరాయి దేశాల్లో వారికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి.
చదవండి: ఉక్రెయిన్‌ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే

కనీసం బస్టేషన్, రైల్వే స్టేషన్‌ పేర్లు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంగ్లిష్, ఉక్రేనియన్‌ తెలిసిన విద్యార్ధులు, మేధావులు శిబిరాలకు వెళ్లి సాయం చేస్తున్నారు. బుడాపెస్ట్‌లో వాలంటీర్‌గా పని చేసేందుకు ముందుకొచ్చిన అంధుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ‘‘శరణార్థుల్లో చాలామందికి మా భాష రాదు. వారికి అనువాదకునిగా సాయం చేస్తున్నా. నాకు 7 భాషలొచ్చు. వారికి ఏ భాషలో కావాలన్నా సాయం చేస్తా. చాలామందికి ఎటు పోవాలో కూడా తెలియదు. వారిని ఎన్జీవో శిబిరాలకు పంపుతున్నా. అంతా వదిలేసి కట్టుబట్టలతో, పుట్టెడు దుఃఖంతో వచ్చేవారికి భరోసా ఇవ్వడమే మనం చేసే గొప్ప సాయం!’’ అన్నాడతను.

మరిన్ని వార్తలు