Ukraine Russia Conflict: ముంచుకొస్తున్న కొరత!.. మేలుకోకుంటే అనర్థమే

17 Mar, 2022 07:53 IST|Sakshi

మేలుకోకుంటే అనర్థమేనంటున్న నిపుణులు

Russia-Ukraine War: ప్రపంచ ఎరువుల కొరతకు రష్యా– ఉక్రెయిన్‌ సంక్షోభం ఆజ్యం పోయనుందని ప్రముఖ వ్యవసాయ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధ ఫలితంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్, వంటచమురు ధరలకు రెక్కలు వచ్చాయి. త్వరలో ఈ ప్రభావం ప్రపంచ ఆహార వ్యవస్థపై పడుతుందని ఆందోళనలున్నాయి. తాజాగా ఈ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడుతుందని, దీంతో ఒక్కమారుగా వీటి ధరలు పెరిగి పంట ఉత్పత్తి భారీగా క్షీణిస్తుందని జాన్‌ హామండ్, వైయోర్గోస్‌ గడ్నాకిస్‌ అనే ఆహార శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతావరణంలోని నత్రజనిని హైడ్రోజన్‌తో సంయోగం చెందించడం ద్వారా అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు.

ఎరువుల ఉత్పత్తిలో అమ్మోనియాది కీలక స్థానం. అమ్మోనియా తయారీకి భారీగా శక్తి అవసరపడుతుంది. అంటే ఇంధన ధరల పెరుగుదల అమ్మోనియా ఉత్పత్తిపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే అమెరికాలో అమ్మోనియం నైట్రేట్‌ ధర టన్నుకు 650 నుంచి వెయ్యి డాలర్లకు పెరిగింది. ఇంతవరకు ఒక్క కిలో నైట్రోజన్‌ ఎరువు వాడిన పొలంలో సుమారు 6 కిలోల దిగుబడి వస్తే ఖర్చులు పోను లాభం మిగిలేది. కానీ ఎరువు ధర పెరగడంతో ఇప్పుడు లాభం రావాలంటే ఒక్క కిలో ఎరువు వాడకానికి 10 కిలోల పంట రావాల్సిఉంటుందని అంచనా. అలాగని ఎరువులు తక్కువగా వాడితే దాని ప్రభావం దిగుబడి, నాణ్యతపై పడుతుంది. ఈ పరిస్థితి రైతును అడకత్తెరలో పోకచెక్కలా మారుస్తోందని జాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 
చదవండి: జపాన్‌లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ 

వచ్చే సీజన్‌ నుంచి ప్రభావం 
ఉక్రెయిన్‌ సంక్షోభ ఫలితంగా ఇంధన ధరలు పెరిగిన ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై వచ్చే పంట సీజన్‌లో కనిపిస్తుందని పరిశోధకుల అంచనా. అప్పటికి ముందే కొనుగోలు చేసిన ఎరువులు రైతుల వద్ద అయిపోవడంతో కొత్తగా ఎరువుల కొనుగోలు చేయాల్సి వస్తుంది. అప్పటికి ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగి ఉంటాయి. దీనివల్ల రైతు తక్కువగా ఎరువులు కొనుగోలు చేయడం జరగవచ్చని, ఇది కమతంలో పంట దిగుబడి తగ్గడానికి దారితీస్తుందని జాన్‌ విశ్లేషించారు.

ప్రపంచ ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్ధాల సరఫరా అత్యధికంగా రష్యా, ఉక్రెయిన్‌ నుంచి జరుగుతుంది. యూరప్‌లో అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారైన యారా కంపెనీ అవసర ముడిపదార్థాలను ఉక్రెయిన్‌ నుంచి కొం టుంది. సంక్షోభం కారణంగా ఉక్రెయిన్‌ పతనమవ డం, రష్యాపై ఆంక్షలు విధించడం ముడిపదార్ధాల సరఫరాపై ప్రభావం చూపనున్నాయి. బెలారస్, రష్యాలు ప్రపంచ పొటాషియం ఉత్పత్తిలో మూడోవంతును ఉత్పత్తి చేస్తున్నాయి. ఎరువుల తయారీలో పొటాషియం కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  
చదవండి: దాడులు ఆపండి.. రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు

ఆహార భద్రత 
ఎరువుల ఉత్పత్తి తగ్గడం తత్ఫలితంగా ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గడం కలిసి అంతిమంగా ప్రపంచ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడతాయని జాన్, వైయోర్గోస్‌ అంచనా వేశారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ ఆహార భద్రత విషమంగా మారింది. 2019లో ప్రపంచ జనాభాలో 9 శాతం మంది కరువు కోరల్లో ఉన్నారు. కరోనా ప్రభావంతో వీరి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు ఎరువుల కొరత కారణంగా ప్రపంచ ఆకలి కేకలు మరింతగా పెరగనున్నాయి.

ప్రభుత్వాలు తక్షణం తగిన చర్యలు తీసుకోకపోతే చాలామంది కరువు రక్కసికి బలికాక తప్పదని నిపుణుల హెచ్చరిక. ప్రజలను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు ముందుగా మేలుకొని ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టడం, దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడం, పేదరిక రేఖకు దిగువన ఉన్నవారికి తగినంత ఆహార భద్రత కల్పించడం, సరిపడా ఆహారధాన్యాలను సమీకరించి నిల్వ చేసుకోవడం తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి.

మరిన్ని వార్తలు