Ukraine Russia War: కష్టకాలంలో ఉక్రెయిన్‌.. మాతృదేశం కోసం భర్తతో కలిసి ఏకంగా రూ.267 కోట్లు

22 Mar, 2022 13:11 IST|Sakshi

గత 27 రోజులుగా కొనసాగుతున్న రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ కకావికలం అవుతోంది.  ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు రష్యా మారణహోమం సృష్టిస్తోంది. రష్యా విధ్వంసానికి ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా కూలిన భవనాలు, గోడలు, శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ఉన్న ఊరుని, ఇళ్లను వదిలి దాదాపు పది లక్షల మంది పౌరులు పొరుగు దేశాలకు శరనార్థులుగా వెళుతున్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్‌ ఎక్కడా తగ్గడం లేదు. యుద్ధంలో రష్యా సైన్యానికి ఎదురొడ్డి పోరాడుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అనేక దేశాలు మానవతా సాయాన్ని అందిస్తున్నాయి.

ఈ క్రమంలో దాదాపు నాలుగు వారాలుగా రష్యా దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు ఓ హాలీవుడ్ జంట ఏకంగా 35 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.267 కోట్లు) విరాళంగా సేకరించింది. అమెరికాకు చెందిన ఆస్టన్ కుచర్, మిలా కునిస్ దంపతులు సామాజిక మాధ్యమాల వేదికగా ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించారు. రష్యా చేస్తున్న ముప్పేట దాడులతో సర్వస్వాన్ని కోల్పోతున్న ఉక్రెయిన్ పౌరులకు తమ వంతు సాయం చేయాలని ఆస్టన్ కుచర్ జంట సంకల్పించింది.
చదవండి: భారత్‌ వణుకుతోంది.. బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు

ఇందుకోసం ‘గో ఫండ్ మీ’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విరాళాలు సేకరించారు. నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో ఇప్పటివరకు 35 మిలియన్ల డాలర్లు విరాళంగా సమకూరాయి. 1983లో ఉక్రెయిన్‌లో జన్మించిన కునిస్ మాతృదేశానికి తనవంతు సాయం చేయడం పట్ల ఉప్పొంగిపోయారు. ఇక కష్టకాలంలో ఉన్న ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన ఈ జంటపై ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వాళ్లే ప్రపంచంలో స్ఫూర్తి నింపుతారంటూ ట్వీట్‌ చేశారు.
చదవండి: Russia Ukraine War భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం!

కాగా మిలా కునిస్‌ 1983లో ఉక్రెయిన్‌లోనే జన్మించారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఒక అమెరికన్‌ అయినందుకు ఎప్పుడూ గర్వపడతాను. కానీ ఈరోజు నాకు ఉక్రేనియన్‌ దేశస్తురాలిని అని చెప్పుకునేందుకే ఎక్కువ గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. అని తెలిపారు. అదే విధంగా తాను ఒక ఉక్రేనియన్‌ను పెళ్లి చేసుకున్నందుకు గర్వంగా ఉందంటూ కునిస్‌ భర్త ఆస్టన్ కుచర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు