Ukraine-russia war: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్‌

28 Oct, 2022 06:00 IST|Sakshi
రష్యా దాడులతో షక్తార్‌స్క్‌లోని ఆయిల్‌ డిపోలో ఎగసిన మంటలు

మాస్కో: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించే ఉద్దేశం తమకు లేనేలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. రాజకీయంగా, సైనికపరంగా కూడా తమకు అలాంటి అవసరం లేదన్నారు. ప్రపంచంపై పెత్తనం కోసం పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని అన్నారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ ఆడుతున్నాయంటూ అమెరికా, మిత్ర పక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు.

కాగా, ఖేర్సన్‌ను తిరిగి తమ వశం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకొస్తున్న ఉక్రెయిన్‌ సేనల ధాటికి ఖేర్సన్‌లోని రష్యా అనుకూల ఉన్నతాధికారులు పారిపోయారు. వీరితోపాటు వేలాది మంది స్థానికులు దాడుల భయంతో స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. ‘తాజాగా అమెరికా, పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య ఉపగ్రహాలను యుద్ధంకోసం ఉక్రెయిన్‌ వాడుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం’ అని ఐరాసలో ఆయుధాల నియంత్రణ ప్యానెల్‌లో రష్యా ప్రతినిధి కాన్‌స్టాంటిన్‌ ఆరోపించారు.  యుద్ధం కారణంగా శిలాజ ఇంధనాలకు ఎవరూ ఊహించనంతగా డిమాండ్‌ పెరిగే ప్రమాదముందని పారిస్‌ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ తన నివేదికలో హెచ్చరించింది.
 

>
మరిన్ని వార్తలు