Ukraine-Russia war: రణభూమి తూర్పు ఉక్రెయిన్‌

28 May, 2022 05:38 IST|Sakshi
డోన్బాస్‌లో రష్యా దాడుల్లో ధ్వంసమైన జిప్సం తయారీ ప్లాంటు

వైమానిక దాడులను ఉధృతం చేసిన రష్యా సైన్యం

సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్, ఖర్కీవ్‌లో పౌరుల మృతి

సీవిరోడోంటెస్క్‌లో 60 శాతం నివాస గృహాలు ధ్వంసం

కీవ్‌/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ఉధృతమయ్యాయి. కీలక పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్‌పై పట్టుబిగించేందుకు రష్యా దళాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. శుక్రవారం సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్‌లో భీకర దాడులకు దిగాయి. సీవిరోడోంటెస్క్‌లో ఇప్పటిదాకా 1,500 మంది మరణించారని, దాదాపు 13,000 మంది క్షతగాత్రులయ్యారని స్థానిక మేయర్‌ ఒలెగ్జాండర్‌ స్టిరియుక్‌ చెప్పారు. గత 24 గంటల్లో నలుగురు బలయ్యారని తెలిపారు. ఈ పట్టణంలో 60 శాతం నివాస గృహాలు రష్యా దాడుల్లో ధ్వంసమయ్యాయి.

విదేశీ ఆయుధాలను వెంటనే రంగంలోకి దించకపోతే సీవిరోడోంటెస్క్‌ను రష్యా సైన్యం బారి నుంచి కాపాడడం కష్టమని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా హెచ్చరించారు. రష్యా వైమానిక దాడుల్లో లీసిచాన్‌స్క్‌ సిటీలో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఖర్కీవ్‌లోని బలాక్లియాలో ఇద్దరు వృద్ధులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌పై రష్యా సైన్యం భీకరస్థాయిలో దాడులకు పాల్పడింది. నిప్పుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో కనీసం 9 మంది పౌరులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని లాంచ్‌ రాకెట్లు సిస్టమ్స్‌ ఇవ్వండి
తూర్పు డోన్బాస్‌లో రష్యా దాడులను తిప్పికొట్టడానికి తమకు మరిన్ని లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ సాధ్యమైనంత త్వరగా పంపించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చిమ దేశాలను కోరారు. ఆయన తాజాగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు. యుద్ధ రీతిని మార్చడానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌ భద్రత, స్వేచ్ఛ కోసమే తమ పోరాటం సాగుతోందని అన్నారు. ఆక్రమణదారులను ఉక్రెయిన్‌ నుంచి తరిమికొట్టడానికి మరింత ఆత్మవిశ్వాసంతో, వేగంగా ముందుకు సాగుతున్నామని ప్రజలకు తెలియజేశారు.

మరో ఇద్దరు రష్యా సైనికుల విచారణ
యుద్ధ నేరాల కింద ఉక్రెయిన్‌ కోర్టు ఇప్పటికే ఒక రష్యా సైనికుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. యుద్ధ నేరాల ఆరోపణల కింద మరో ఇద్దరు రష్యా జవాన్లు తాజాగా కోర్టులో విచారణకు హాజరయ్యారు. అలెగ్జాండర్‌ అలెక్సీవిచ్‌ ఇవానోవ్, అలెగ్జాండర్‌ వ్లాదిమిరోవిచ్‌ బాబీకిన్‌ను కొటెలెవ్‌స్కీ జిల్లా కోర్టు విచారించింది. వారికి దాదాపు 12 ఏళ్ల చొప్పున కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.  

పశ్చిమ దేశాలకు ఇక ఆర్థిక కష్టాలే: పుతిన్‌  
తమ దేశాన్ని ఏకాకిని చేయాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడలు ఫలించబోవని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తేల్చిచెప్పారు. పశ్చిమ దేశాలకు ఇకపై మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం ఖాయమని అన్నారు. యూరేసియన్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పుతిన్‌ మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో రష్యాను ఒంటరి చేయడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అలాంటి ప్రయత్నాలు చేసే వారికి చేదు అనుభవమే మిగులుతుందన్నారు. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోందని, నిరుద్యోగం తాండవిస్తోందని, సప్లై చైన్‌ తెగిపోతోందని, ఆహార సంక్షోభం ముదురుతోందని పుతిన్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు