Swift Effect On Russia: స్విఫ్ట్‌ అంటే ఏంటి?.. బహిష్కరణతో రష్యాకు నిజంగానే నష్టమా?

28 Feb, 2022 09:08 IST|Sakshi

ఆంక్షలతో రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పాశ్చాత్య దేశాలు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్విఫ్ట్‌ నుంచి రష్యాను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. రష్యా కంపెనీలు, కుబేరులకు ఉన్న ఆస్తులను గుర్తించి జప్తు చేసేందుకు ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కూడా అమెరికా, యూరోపియన్‌ కమిషన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లండ్, కెనడా నిర్ణయించాయి. పుతిన్‌కు ఈ యుద్ధం అతిపెద్ద వ్యూహాత్మక వైఫల్యంగా మిగిలిపోయేలా చేసి తీరతామంటూ ఆయా దేశాల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. క్రమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను పూర్తిగా బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక ఆంక్షల్లో చివరి అస్త్రంగా అభివర్ణించే స్విఫ్ట్‌ బహిష్కరణ వల్ల నిజంగా రష్యాకు జరిగే నష్టం ఎంతో చూద్దాం.. 


సొసైటీ ఫర్‌ వరల్డ్‌ వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్‌.. షార్ట్‌ కట్‌లో స్విఫ్ట్‌. హెడ్‌ క్వార్టర్స్‌ బెల్జియంలో ఉంది.  ప్రపంచంలోని 200 దేశాలకు పైగా లావాదేవీలకు అనుసంధానకర్త ఈ స్విఫ్ట్‌. సుమారు 11 వేలకు పైగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. ఇందులో సభ్యులుగా ఉంటాయి. స్విఫ్ట్‌ పేరుకు తగ్గట్లే వేగంగా పని చేస్తుంది.  ప్రపంచంలోని ఏ మూల ఉన్నా సరే.. క్షణాల్లో వ్యక్తులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నమాట.  స్విఫ్ట్‌పరంగా ఆంక్షలు విధిస్తే.. ఆటోమేటిక్‌గా అంతర్జాతీయ సమాజం నుంచి ఆ దేశం దూరమైనట్లే లెక్క!. అలాగే అవసరం అనుకుంటే ఆ నిషేధాన్ని ఎత్తేయొచ్చు కూడా.


ఎఫెక్ట్‌ ఎంతంటే.. 

మరి స్విఫ్ట్‌ నుంచి రష్యాను తొలగించడం వల్ల ఏమేర ప్రభావం ఉంటుందంటే.. రష్యా బ్యాంకులు అమెరికా, కెనడా, యూరప్‌లోని బ్యాంకులతో అనుసంధానం కాలేవు.  ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోతాయి(ఆల్రెడీ పోయాయి కూడా). ముఖ్యంగా రష్యా ధనికులపై తీవ్ర ప్రభావం పడుతుంది. రష్యా బ్యాంకుల కార్యకలాపాలు విదేశీయంగా నిలిచిపోతాయి. ఏటీఎం, నెట్‌బ్యాంకింగ్‌ సహా ఏవీ పని చేయవు. క్రమక్రమంగా రష్యాలోనూ ఈ ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి.   రష్యా సెంట్రల్‌ బ్యాంకు దగ్గర ఉన్న దాదాపు 60 వేల కోట్ల డాలర్లకు పైగా విదేశీ మారక ద్రవ్య నిధులపైనా ఈ నిషేధం కొనసాగుతుంది. చివరికి.. రష్యా కీలక సంపద చమురు, సహజవాయువు ఎగుమతులపైకు కూడా స్విఫ్ట్‌ వ్యవస్థ అవసరం. పరిస్థితి చేజారితే.. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం లేకపోలేదు.  అందుకే నిషేధంపై రష్యా లోలోపల గుర్రుగా ఉంది. అయితే దీనివల్ల తమకొచ్చిన నష్టం లేదని, స్విఫ్ట్‌కు ప్రత్యామ్నయ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటామని పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది.     

ఇంతకు ముందు.. 

ఇలా స్విఫ్ట్‌ ఆంక్షలు విధించడం గతంలోనూ జరిగింది. అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై ఈ తరహా నిషేధం విధించడం వల్ల .. విదేశీ వాణిజ్యంలో 30 శాతం నష్టపోయింది. ఇంతకుముందు రష్యాకు ఓసారి స్విఫ్ట్‌ వార్నింగ్‌ పడింది కూడా. 2014 క్రిమియా (ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉండేది) ఆక్రమణ సందర్భంగా స్విఫ్ట్‌ నిషేధం విధిస్తామని పాశ్చాత్య దేశాలు బెదిరించగా.. ఇది యుద్ధమే అవుతుందంటూ రష్యా ప్రకటించడంతో వెనక్కి తగ్గాయి.  


యూరప్‌ దేశాల నుంచి అభ్యంతరాలు?
ఆర్థికంగా రష్యా రెక్కలు విరిచే చర్యలను అమెరికా, నాటో సభ్య దేశాలు ఒక్కొక్కటిగా అమల్లో పెడుతున్నాయి. అయితే.. యూరప్‌ తో రష్యా ఏడాదికి 8 వేల కోట్ల యూరోలకు పైనే వాణిజ్యం జరుపుతోంది. అందుకే స్విఫ్ట్‌పై పలు యూరప్‌ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్‌పై మొండిగా రష్యా ముందుకు పోతుండడంతో.. నిన్నటిదాకా వ్యతిరేకించిన యూరప్‌ దేశాలు సైతం అంగీకారం చెప్తుండడం విశేషం. అంతేకాదు ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేసేందుకు టట్రాన్స్‌ అట్లాంటిక్‌ సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యూరప్‌ కమిషన్‌(ఈసీ) ప్రెసిడెంట్‌ ఉర్సులా వానెడెర్‌ లియాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు