UK PM Boris Johnson: చైనా ఎందుకలా చేస్తోంది.. ఇప్పటికైనా మేల్కొంటే బెటర్‌!

21 Mar, 2022 12:37 IST|Sakshi

లండన్‌​: రష్యా, ఉక్రెయిన్‌ సంక్షోభంలో సరైన పక్షంవైపు నిలవాల్సిందిగా చైనాకు ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సూచించారు. నియంతృత్వ ప్రపంచ స్థాపనకు కలలుగంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధ పిపాసను చైనా ఇప్పటికీ ఖండించడం లేదంటూ తప్పుబట్టారు. చైనా మదిలో మరేదో ఆలోచన ఉందని జాన్సన్‌ అనుమానం వ్యక్తం చేశారు. సండే టైమ్స్‌ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్‌ ప్రతిఘటన పుతిన్‌తో పాటు చైనాను కూడా షాక్‌కు గురి చేసిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా చైనా మేల్కోవాలని తప్పుడు వైఖరితో ఇబ్బందుల్లో పడొద్దని సూచించారు. యుద్ధం అనేది దురదృష్టకర ఘటన అని​.. అయితే, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని తర్కించలేనని అన్నారు. ఏదేమైనా తమ మద్దతు మాత్రం ఉక్రెయిన్‌కేనని ఆయన స్పష్టం చేశారు. చాలా దేశాలు పుతిన్‌ దూకుడుచూసి భయపడుతున్నాయని, అయితే ఉక్రెయిన్‌ త్వరగా కోలుకుంటుందని జాన్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇదిలాఉండగా.. పుతిన్‌తో చర్చలకు సిద్ధమని జెలెన్‌స్కీ మరోసారి చెప్పారు. సమస్యలను చర్చలతో పరిష్కరించుకుందామని రెండేళ్లుగా చెప్తూ వస్తున్నానన్నారు. చర్చలు తప్ప యుద్ధాన్ని ఆపడానికి మరో మార్గం లేదన్నారు. చర్చల ప్రయత్నాలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధ అనివార్యమని ఆయన హెచ్చరించారు.
(చదవండి: బడిపై రష్యా బాంబుల వర్షం.. 150 మంది సేఫ్‌.. మిగతావారి పరిస్థితి!)

మరిన్ని వార్తలు