టిట్‌ ఫర్‌ టాట్‌: పుతిన్‌పై బ్యాన్‌ విధించిన కెనడా

18 May, 2022 15:17 IST|Sakshi

ఒట్టావా: ఉత్తర అమెరికా దేశం కెనడా ఊహించని నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై నిషేధం విధించింది. పుతిన్‌తో పాటు మరో వెయ్యి మంది రష్యన్‌ జాతీయలు మీద(రాజకీయ నేతలు, ప్రముఖులు, అధికారులు ఉన్నారు) కూడా బ్యాన్‌ విధిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. 

ఉక్రెయిన్‌ పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది కెనడా. రష్యా ఉక్రెయిన్‌ గడ్డపై పాల్పడుతున్న యుద్ధనేరాలకు ప్రతిగానే పుతిన్‌, ఆయన అనుచర గణం ఎంట్రీపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇం‍దుకోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా.. పాశ్చాత్య దేశాల తరపున ఉక్రెయిన్‌కు మద్ధతు చెప్పిన నేతల జాబితాలో ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా చేరిపోయారు.  

ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత.. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షల్లో కెనడా సైతం భాగమైంది. ఈ తరుణంలో రష్యా, ట్రూడోతో పాటు సుమారు 600 మంది కెనడా ప్రముఖులపై నిషేధం విధించింది. దీనికి ప్రతిగానే ఇప్పుడు ప్రత్యేక చట్టం ద్వారా పుతిన్‌ అండ్‌ కోపై నిషేధం విధించింది కెనడా.

ఇదిలా ఉండగా.. ఈ నెల మొదట్లో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఉక్రెయిన్‌పై హఠాత్తుగా పర్యటించారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో.. ముందుగా ఇర్విన్‌ పట్టణాన్ని రష్యా బలగాలు నాశనం చేశాయి. అందుకే కెనడా ప్రధాని ట్రూడో ఇర్విన్‌లోనే పర్యటించారు. అక్కడి పౌరుల ఇళ్లు దెబ్బతినడంపై ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యి.. యుద్ధంలో ఉక్రెయిన్‌కు కెనడా మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించాడు కూడా.

చదవండి: నియంతలు అంతం కాక తప్పదు: జెలెన్‌స్కీ

మరిన్ని వార్తలు