ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యా తగ్గేదే లే! ఐసీజే ఆదేశాల్ని తిరస్కరణ.. మొండిగా భీకర దాడులతో ముందుకు..

17 Mar, 2022 16:49 IST|Sakshi

ఉక్రెయిన్‌పై ఆక్రమణలో రష్యా కఠిన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యలను ఆపేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు రష్యా ఒక ప్రకటన చేసింది. 

ఏఎఫ్‌పీ న్యూస్‌ ఏజెన్సీ ప్రకారం.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని క్రెమ్లిన్‌ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడుల్ని మరింత తీవ్రం చేయనుందనే ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉంటుంది. కానీ..

ఉక్రెయిన్ దాడిని సస్పెండ్ చేయాలని రష్యాకు UN ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను క్రెమ్లిన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో.. పెండింగ్‌లో ఉన్న తీర్పు మీదే ఉక్రెయిన్‌ భవితవ్యం ఆధారపడి ఉందన్నిక ఐసీజే ఆదేశాల పట్టింపు లేకుండా 22వ రోజూ ఉక్రెయిన్‌పై ఆక్రమణ కొనసాగిస్తోంది రష్యా. మరోపక్క శాంతి చర్చలపై స్పష్టత కొరవడి గందరగోళం నెలకొంది. ఇంకోవైపు రష్యా బలగాలు మెరెఫాలో స్కూల్‌ భవనాన్ని నాశనం చేశాయి. ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది.

ఐసీజే ఆదేశాలివి..
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ కోర్టు సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది.  కాగా, అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో తామే గెలిచామని పేర్కొన్నారు. కానీ, రష్యా మాత్రం తగ్గడం లేదు.

మరోవైపు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి పై జరిగిన ఓటింగ్‌లో భారత్‌ (భారత న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ) రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది.

పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న కథనాలను మాస్కో వర్గాలు ఖండించాయి. సుమారు వెయ్యి మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్న Mariupol థియేటర్‌పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తమ బలగాలు  మరియూపోల్‌ భవనంపై దాడి చేయలేదని చెప్తున్నాయి. ఇంకోపక్క ఈ యుద్ధంలో ఇప్పటిదాకా 14 వేలమంది రష్యన్‌ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ జనరల్‌స్టాఫ్‌ ప్రకటించారు.

కొత్త గోడ ధ్వంసానికి సాయం చేయండి
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ  జర్మనీకి ఆసక్తికరమైన పిలుపునిచ్చారు. ఐరోపాలో రష్యా నిర్మిస్తున్న కొత్త గోడ ధ్వంసం చేయడంలో సహాయపడాలని కోరాడు. బుండెస్టాగ్ దిగువ సభ పార్లమెంటును ఉద్దేశించి గురువారం ప్రసగించిన జెలెన్‌స్కీ.. భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. ఇక శాంతి చర్చలపై స్పష్టత కొరవడింది. స్వీడన్‌, ఆస్ట్రియా తరహాలో తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ ఊహూ అంటోంది.

మరిన్ని వార్తలు