Ukraine War: పుతిన్‌ చాయిస్‌.. ఉక్రెయిన్‌ చర్చల కోసం బెలారస్‌ ఎందుకంటే..

28 Feb, 2022 09:03 IST|Sakshi

ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాకు పూర్తి సాయం 

సొంత దేశంలోనూ లుకషెంకోపై విమర్శలు 

అందుకే అక్కడ చర్చలకు ఉక్రెయిన్‌ ససేమిరా

బెలారస్‌ అధ్యక్షుడు, ఆ దేశాన్ని 28 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న అలగ్జాండర్‌ లుకషెంకో రష్యాకు దాసోహమనడం ఉక్రెయిన్‌లో రక్తచరిత్రను రాస్తోంది. ఒకప్పుడు బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌ వేదికగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. 2014, 2015లో రష్యా. ఉక్రెయిన్‌ మధ్య మిన్‌స్క్‌ 1, 2 ఒప్పందాలు కూడా కుదిరాయి. అలాంటి గడ్డపై శాంతి చర్చల కోసం కాలు మోపేదే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెగేసి చెప్పడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. బెలారస్‌ అధ్యక్షుడు లుకషెంకో వ్యవహార శైలిపై ఉక్రెయిన్‌లో అసంతృప్తి భగభగమంటోంది.

రష్యా సేనలు ఉక్రెయిన్‌ చేరుకోవడానికి లుకషెంకో ఎంతో సహకారం అందించారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టి మరీ రష్యా సేనలకు ఆశ్రయం కల్పించడం, సరిహద్దులు దాటించడం వంటి పనులు చేశారు. కొద్ది  నెలలుగా దాదాపుగా 30 వేల రష్యా బలగాలు విన్యాసాల పేరుతో బెలారస్‌లోనే మకాం వేసి పుతిన్‌ ఆదేశాల కోసం ఎదురు చూశాయి. అందుకే అమెరికా, యూరప్‌ దేశాలు రష్యాతో పాటు బెలారస్‌పైనా ఆర్థిక ఆంక్షలు విధించాయి. 

పుతిన్‌ చెప్పినట్టు ఆడుతూ..
లుకషెంకో ఎన్నికల్లో ఇప్పటిదాకా ఓటమే ఎరుగలేదు. 2020లో జరిగిన ఎన్నికల్లో వరసగా ఆరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే రిగ్గింగ్‌ చేసి నెగ్గారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 24 శాతం మంది మాత్రమే ఆయనకు మద్దతుగా ఉన్నారని సర్వేలు తేల్చినా అధ్యక్షుడు కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకంగా రోడ్లెక్కి నిరసనలు చేశారు. అధ్యక్షుడిపై నిరసనలు మరింత ఎక్కువైతే భద్రతాపరంగా సాయం చేస్తానంటూ పుతిన్‌ హామీ కూడా ఇచ్చారు. లుకషెంకో అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే పుతిన్‌ మద్దతే కారణం. పుతిన్‌ సహకారం లేకుండా ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగే పరిస్థితి లేదు. అందుకే పుతిన్‌ ఆడమన్నట్టుగా ఆడుతున్నారంటారు.

సొంత దేశంలో ప్రజాస్వామిక నిరసనల్ని పుతిన్‌ సహకారంతో అణిచివేసిన లుకషెంకో ఇప్పుడు రష్యాకు మద్దతునివ్వడం ద్వారా తమ దేశ సార్వభౌమాధికారాన్నే తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘మా దేశానికి సార్వభౌమత్యం ఉందని మేము భావించడం లేదు. మా అధ్యక్షుడు రష్యా చేతిలో కీలుబొమ్మ. బెలారస్‌ సైనికులు కూడా పుతిన్‌ చెప్పుచేతల్లోనే ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం’’ అని బెలారస్‌లోని బ్రెమెన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఎడిటర్‌ ఓల్గా డ్రిండోవా ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ స్వాధీనానికి రష్యాకు సహకరిస్తే భారీగా నిధులొస్తాయని, వాటితో సైన్యాన్ని శక్తిమంతం చేయొచ్చని లుకషెంకో ఇలా చేస్తున్నారని బెలారస్‌ వ్యవహారాలపై పట్టున్న కివీవ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఇహర్‌ టిష్‌కెవిచ్‌ అభిప్రాయపడ్డారు. 

రష్యా, బెలారస్‌ది విడదీయలేని బంధం  
రష్యా, బెలారస్‌ ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌లో భాగమే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దృఢమైన వాణిజ్య బంధముంది. 2020లో వాటి మధ్య 2950 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రెండు దేశాలు తరచూ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాయి. 
–సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

ఉక్రెయిన్‌తో తెగిన వాణిజ్య బంధం  
ఒకప్పుడు ఉక్రెయిన్‌తో బెలారస్‌కున్న బలమైన వాణిజ్య సంబంధాలు యుద్ధంతో తెగిపోయాయి. 2019లో బెలారస్‌ 414 కోట్ల డాలర్ల పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి చేస్తే అందులో సగానికిపైగా ఉక్రెయిన్‌కే వెళ్లాయి. ఉక్రెయిన్‌కు బెలారస్‌ విద్యుత్‌ కూడా సరఫరా చేస్తుంది. ఇప్పడవన్నీ నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు