ఉక్రెయిన్‌కు చేసేది సాయం కాదు.. పెట్టుబడి.. జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు..

22 Dec, 2022 12:50 IST|Sakshi

వాషింగ్టన్‌: రష్యా తమపై దండయాత్ర చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. బుధవారం అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించారు. అగ్రరాజ్యం తమ దేశానికి అందిస్తున్న భారీ సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తుంది సాయం కాదని, ప్రాజాస్వామ్యం, అంతర్జాతీయ భద్రతకు అగ్రరాజ్యం పెడుతున్న పెట్టుబడి అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. 2023లోనూ తమకు సాయాన్ని కొనసాగించారని కోరారు. 

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై అమెరికా విజయం సాధించినట్లు తాము కూడా వెనుకడుగు వేయకుండా రష్యాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని జెలన్‌స్కీ స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అమెరికా కాంగ్రెస్ అభినందించింది. సభ్యలందరూ లేచి నిలబడి కరత్వాల ద్వనులతో జెలెన్‌స్కీ పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నారు.

అగ్రరాజ్యం ఇప్పటికే ఉక్రెయిన్‌కు 50  బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించింది. త్వరలో పేట్రియట్ మిసైల్స్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చింది. అయితే అమెరికా అందిస్తున్న సాయాన్ని జెలెన్‌స్కీ పెట్టుబడి అనడం వెనుక కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమెరికా ప్రతినిధుల సభ రిపబ్లికన్ల చేతిలోకి వెళ్లనుంది. ఉక్రెయిన్‌కు భారీ ప్యాకీజీపై వారు సుముఖంగా లేరు. డెమొక్రాట్లు భారీ మొత్తాన్ని యుద్ధ సాయంగా సమకూర్చడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు దిగవ సభ వాళ్ల నియంత్రణలోకే వస్తుంది కనుక కచ్చితంగా ప్యాకీజీ బిల్లును అడ్డుకుంటారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ల మనసు మార్చే విధంగా జెలెన్‌స్కీ మాట్లాడారు.

కాంగ్రెస్‌లో ప్రసంగించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు జెలెన్‌స్కీ. ఇద్దరూ కలిసి ఓవల్ ఆఫీస్‌లో కన్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
చదవండి: వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో..

మరిన్ని వార్తలు