క్రిమియా చమురు నిల్వకేంద్రంపై దాడులు

30 Apr, 2023 05:20 IST|Sakshi

ఇది ఉక్రెయిన్‌ పనే: రష్యా

కీవ్‌: తొమ్మిదేళ్ల క్రితం రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్‌ ద్వీపకల్ప ప్రాంతం క్రిమియాపై శనివారం ఉక్రెయిన్‌ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. దీంతో క్రిమియాలోని తీరప్రాంత నగరం సెవస్తపోల్‌లోని చమురు నిల్వ కేంద్రానికి నిప్పు అంటుకుని అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ‘ఈ దాడి ఉక్రెయిన్‌ డ్రోన్ల పనే. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రస్తుతానికి ఒక్కచోట మాత్రమే మంటలు ఆర్పగలిగాం’ అని నగర గవర్నర్‌ మిఖాయిల్‌ రజవోజయేవ్‌ చెప్పారు. మరణాల వివరాలను ఆయన వెల్లడించలేదు.

ప్రతిదాడి చేసి క్రిమియాను మళ్లీ ప్రధాన భూభాగంలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తామని ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించడం, శుక్రవారమే 20 క్రూయిజ్‌ క్షిపణులతో దాడి చేసి రష్యా 23 మంది పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయిల్‌ డిపోలో 10 ట్యాంకుల్లో అగ్గిరాజుకోవడం దేవుడు వేసిన శిక్ష అంటూ ఉక్రెయిన్‌ సైనిక నిఘా అధికార ప్రతినిధి ఆండ్రీ యుసోవ్‌ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా అక్రమంగా విలీనం చేసుకున్న ఖేర్సన్‌ ప్రావిన్స్‌లోని నోవా కఖోవ్కా సిటీపైకి ఉక్రెయిన్‌ సేనలు భారీ స్థాయిలో కాల్పుల మోత మోగించాయి.

మరిన్ని వార్తలు