Russia Ukraine War: వీరుడి త్యాగం.. కన్నీరు కారుస్తున్న ఉక్రెయిన్‌

26 Feb, 2022 16:49 IST|Sakshi

Russia-Ukraine War: రష్యన్‌ బలగాలను ఎలాగైనా నిలువరించి తమ దేశాన్ని కాపాడుకోవాలి. అందుకోసం ఏమైనా చేయాలి. ఎంతకైనా సాహసించాలి. అతి పెద్ద ఆయుధ సంపద కల్గిన రష్యాను నిలువరించాలంటే కదన రంగంలో కలియాడాలి. అవసరమైతే ప్రాణాలను సైతం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే ఉక్రెయిన్‌ సైన్యం ముందన్న కర్తవ్యం. ఇదే తరహాలో  తన దేశం కోసం ఏం చేయాలో అది చేసి చూపించాడు ఓ ఉక్రెయిన్‌ సైనికుడు. చివరకు వీర మరణం పొందినా ఆ దేశ మిలటరీ గుండెల్లో నిలిచిపోయాడు.

రష్యన్‌ ట్యాంకర్లు ఖెర్‌సన్‌ సౌత్‌ ప్రొవెన్స్‌లోని హెనిచెస్క్‌ బ్రిడ్జ్‌వైపు దూసుకొస్తున్న సమయంలో ఉక్రెయిన్‌ సైనికుడి సాహసం ఔరా అనిపించింది. రష్యన్‌ ట్యాంకర్లు బ్రిడ్జివైపు వస్తుండటం చూసి వాటిని ఆడ్డుకోవడానికి బ్రిడ్జినే కూల్చివేశాడు. ఆ బ్రిడ్జిని కూల్చే సమయంలో తనకు ఏమౌతుందనే విషయాన్ని పక్కనపెట్టి ప్రాణాలు సైతం వదిలాడు. 

మెరైన్‌ బెటాలియన్‌కు చెందిన వాలోదైమైరోవిచ్‌ రష్యన్‌ బలగాలని ఆపే ప్రయత్నంలో వంతెను ధ్వంసం చేసి తనను తానే పేల్చేసుకున్నాడని ఉక్రెయిన్‌ మిలటరీ విభాగం తమ ఫేస్‌బుక్‌ పేజీలో పేర్కొంది. క్రిమియా- మెయిన్‌ల్యాండ్‌ ఉక్రెయిన్‌కు అనుసంధానించబడి ఉన్న ఆ బ్రిడ్జిపైకి రష్యన్‌ బలగాలు సమీపిస్తుండటం చూసిన జవాను..  ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తనను తాను పేల్చేసుకుని బ్రిడ్జిని ధ్వంసం చేశాడని ఉక్రెయిన్‌ మిలటరీ విభాగం తెలిపింది. రష్యన్‌ బలగాలను కొంచెంలో కొంచెం నిలువరించాలనే తలంపుతో ఆ సైనికుడి చేసిన సాహసాన్ని తలచుకుని ఉక్రెయిన్‌ కన్నీరు కారుస్తోంది.

చదవండి: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు! మా దేశాన్ని రక్షించుకుంటాం

మరిన్ని వార్తలు