పెల్లుబికిన ఉక్రెయిన్‌ పౌరుషం.. రష్యా బలగాలను అడ్డుకుంటున్న సామాన్యులు

21 Mar, 2022 17:38 IST|Sakshi

Unarmed Ukranian People Are Ready To Do Anything: ఉక్రెయిన్‌పై గత మూడువారాలకు పైగా రష్యాయుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యా సైన్యం ముందు ఏ మాత్రం సరితూగని చిన్న దేశం అయినప్పటికీ తమ గడ్డను దురాక్రమణకు గురవ్వనివ్వమంటూ ఉక్రెనియన్లు సాగిస్తున్న పోరు ప్రపంచదేశాల మన్ననలను పొందుతోంది.

మహిళలు, వృద్ధుల, చిన్నపిల్లలు అని తేడా లేకుండా ఇది తమ భూమి.. దీన్ని రక్షించుకుంటామంటూ రైఫిల్స్‌ చేతబట్టారు. పైగా రష్యా బలగాలను చూసి ఏ మాత్రం జంకకుండా ఉత్త చేతులతో యుద్ధ ట్యాంకులను అడ్డుకునేందుకు యత్నించారు. ఉక్రెయిన్ల దేశభక్తిని చూసి.. రష్యా బలగాలు చలించడమే కాక వారు సైతం యుద్ధం చేసేందుకు వెనకడువేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో!. అయితే ఇప్పుడూ మరోసారి అలాంటి తాజా ఘటన ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. ఉక్రెయిన్‌లోని ఎనర్‌గోదర్ అనే నగరంలోకి రష్యా ఆర్మీ వాహనం ఒకటి వచ్చింది. అందులోంచి సైనికులు దిగుతున్నారు. దీంతో వెంటనే అక్కడ ఉ‍న్న చుట్టుపక్కల స్థానికులు ఆ వాహనాన్ని  చుట్టుముట్టారు. ఇది తమ దేశమని.. ఈ దేశాన్ని వదిపోవాలంటూ గట్టిగా నినాదాలు చేస్తూ సైనికులను చుట్టుముట్టారు.

ముందుకు వెళ్లడానికి వీలు లేదు.. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలంటూ రష్యా ఆర్మీ వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. దీంతో రష్యన్ సైనికులు స్థానికులను భయపెట్టేందుకు గాల్లో గట్టిగా కాల్పుల కూడా జరిపారు. కానీ ఉక్రెనియన్‌ వాసులు ఏ మాత్రం భయపడకుండా కాల్పుల జరుపుతున్న సైనికుడిని తిడుతూ.. అతని మీదకి గుంపుగా నినాదాలు చేస్తూ వెళ్లారు. దీంతో రష్యాన్‌ సైనికులు చేసేదేమీ లేక వెంటనే అక్కడున్న వాహనం ఎక్కితిరిగి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఉక్రెయిన్‌: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు మాతృభూమి కోసం సై అంటోంది మరి!)

మరిన్ని వార్తలు