‘నేనిలా బతకలేను.. ట్రీట్‌మెంట్‌ ఆపేయండి!’

20 Jun, 2021 12:07 IST|Sakshi
ఐసీయూలో జాసన్‌(ఫైల్‌)

లండన్‌ : కరోనా కారణంగా అత్యంత ఎక్కువకాలం బాధింపబడ్డ బ్రిటన్‌ వ్యక్తిగా రికార్డుకెక్కిన జాసన్‌ కెక్‌(49) ఇకలేరు. శనివారం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌లోని వెస్ట్‌ యాక్స్‌కు చెందిన జాసన్‌ కెక్‌ 2020 మార్చి 31వ తేదీన కరోనా బారిన పడ్డారు. దీంతో అతడి కిడ్నీలు, ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఇక అప్పటినుంచి సేయింట్‌ జేమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నడవలేని పరిస్థితుల్లో బెడ్‌కే పరిమితమయ్యారు. దాదాపు పది నెలలు పాటు ఇన్‌టెన్సివ్‌ కేర్‌ పైకప్పు చూస్తూ గడిపాడు. వైద్యులు తమ శక్తివంచనలేకుండా అతడ్ని కాపాడటానికి ప్రయత్నించి సఫలయ్యారు. అతడి ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుటపడింది. పది నెలల తర్వాత నడవటం మొదలు పెట్టిన ఆయన.. నర్సుల సహాయంతో నడుస్తున్న వీడియో ఒకటి అప్పట్లో వైరల్‌గా మారింది.

భార్యా, కూతురితో జాసన్‌(ఫైల్‌)
అయితే, ఆ తర్వాతినుంచి జాసన్‌ ఆరోగ్యంలో పెద్ద మార్పేమీ రాలేదు. నడవడానికి ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది. అనారోగ్య సమస్యలు వేధిస్తున్న వేళ ఎప్పుడేమవుతుందా అన్న భయంతో ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేధనకు గురైన జాసన్‌ ఓ కఠిన నిర్ణయానికి వచ్చారు. చావడానికి అన్ని రకాలుగా సిద్ధమై.. ‘నేనిలా బతకలేను.. ట్రీట్‌మెంట్‌ ఆపేయండి!’ అని వైద్యులను కోరారు. ఆయన కోరిక మేరకు.. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు జాసన్‌కు అందిస్తున్న చికిత్సలను ఆపేశారు. దీంతో ఈ శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి  విషమించి కన్నుమూశారు.

మరిన్ని వార్తలు