ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు

23 Sep, 2021 05:53 IST|Sakshi

సర్వసభ్య సమావేశంలో మా ప్రతినిధికి చాన్సివ్వండి

ఐరాసను కోరిన తాలిబన్లు

ఐక్యరాజ్యసమితి: ప్రపంచ దేశాల అంతర్జాతీయ కూటమి అయిన ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో తామకూ భాగస్వామ్య పాత్ర పోషించే అవకాశమివ్వాలని తాలిబన్లు విన్నవించుకున్నారు. తమ శాశ్వత ప్రతినిధి, దోహాకు చెందిన సుహైల్‌ షాహీన్‌ ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు అనుమతినివ్వాలని తాలిబన్లు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌కు తాలిబన్లు లేఖ రాశారు.

అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ నేతృత్వంలోని గత సర్కార్‌ కూలిపోయిందని, ఇక మీదట ఐరాసలో అఫ్గాన్‌ శాశ్వత ప్రతినిధిగా సుహైల్‌ను కొనసాగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి 20న లేఖ వచ్చిందని ఐరాసలో ఉన్నతాధికారి ఫర్హాన్‌ హక్‌ వెల్లడించారు. తమ ప్రతినిధి బృందం ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు, అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌కు మాట్లాడే అవకాశమివ్వాలని తాలిబన్లు కోరినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.

ఘనీ ప్రభుత్వ హయాంలో ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన గ్రామ్‌ ఇసాక్‌జాయ్‌ ఇంకా ఐరాసలో కొనసాగుతున్న నేపథ్యంలో తాలిబన్ల ప్రతిపాదన కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. సర్వ సభ్య సమావేశంలో 193 సభ్య దేశాలకు ఈ విషయం తెలియజేశామని, 27న ‘అఫ్గాన్‌’ సీటు వద్ద ఎవరిని ప్రతినిధిగా సమావేశాల్లో కూర్చోబెట్టాలో ఇంకా నిర్ణయించలేదని ఐరాస ఉన్నతాధికారి ఫర్హాన్‌ చెప్పారు.

తాలిబన్లను బహిష్కరించకండి: ఖతార్‌
అఫ్గాన్‌ సంక్షోభంలో మధ్యవర్తి పాత్ర పోషించిన ఖతార్‌ ఈ విషయంలో స్పందించింది. ‘ అఫ్గాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగాలంటే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. వారిని బహిష్కరించకూడదు. అఫ్గాన్‌ తాత్కాలిక ప్రభుత్వం తరఫున శాశ్వత ప్రతినిధిని ఈ సమావేశాల్లో అనుమతించాలి’ అని న్యూయార్క్‌లో సర్వ సభ్య సమావేశంలో ఖతార్‌ పాలకుడు షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థానీ వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన టర్కీ అధ్యక్షుడు
74 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కశ్మీర్‌ అంశాన్ని భారత్‌–పాక్‌లు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస వేదికగా టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ ఎర్డోగన్‌ బుధవారం మరోసారి లేవనెత్తారు. అయితే, గతంలోనూ ఎర్డోగన్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్‌ తీవ్రంగా తప్పుబట్టింది.

మరిన్ని వార్తలు