ఐరాస సెక్రటరీ జనరల్‌కు వ్యాక్సిన్‌

30 Jan, 2021 13:32 IST|Sakshi

న్యూయార్క్‌లో గుటెర్రస్‌కి కోవిడ్‌ టీకా

వ్యాక్సినేషన్‌లో భారత్‌ కృషికి ప్రశంసలు

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ కోవిడ్‌–19 టీకా తొలి డోసు తీసుకున్నారు. ప్రజలంతా సాధ్యమైనంత త్వరగా కోవిడ్‌ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాలకు సూచించారు. న్యూయార్క్‌ సిటీ ప్రభుత్వ పాఠశాలలో 71 ఏళ్ల గుటెర్రస్‌ మోడెర్నా టీకా తొలి డోసు వేయించుకున్నారు. అనంతరం విజయచిహ్నాన్ని చూపుతోన్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 65 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇస్తున్నామని, ఈ క్రమంలో ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌కి కూడా టీకా వేసినట్టు న్యూయార్క్‌ మేయర్‌ కార్యాలయం ప్రకటించింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి, సాఠశాల సిబ్బందిసహా 65 ఏళ్ళు పైబడిన వారికి న్యూయార్క్‌లో ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే తాను బహిరంగంగా టీకా తీసుకుంటానని గత డిసెంబర్‌లో ప్రకటించిన గుటెర్రస్‌ అందులో భాగంగానే బహిరంగంగా టీకా తీసుకున్నారు. కోవిడ్‌ మరింత ముమ్మరం కాకుండా నిలువరించేందుకు, అందరూ సురక్షితంగా ఉండేందుకు ప్రజలంతా కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని గుటెర్రస్‌ కోరారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన గుటెర్రస్‌ 2021లో తన పది ప్రాధామ్యతలను ప్రస్తావించారు. అందులో కోవిడ్‌–19 కూడా ఒకటని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటోన్న సమస్యల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ సమస్య కూడా ఉందన్నారు. ‘వ్యాక్సిన్‌ జాతీయవాదం’ ఆర్థిక, నైతిక వైఫల్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి దేశానికీ తన ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత, హక్కు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోని ఏ ఒక్క దేశం కూడా వ్యాక్సిన్‌ విషయంలో నిర్లక్ష్యానికి గురికాకూడదని తెలిపారు. 

భారత్‌ సహకారం భేష్‌
భారత్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం ప్రపంచానికే గొప్ప వరమని ఐక్యరాజ్య సమితి చీఫ్‌ కొనియాడారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభం సందర్భంలో ఇతర దేశాలకు కోవిడ్‌ టీకా డోసులను సరఫరా చేస్తోన్న భారత్‌ కృషిని గుటెర్రస్‌ ప్రశంసించారు. అంతర్జాతీయ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కీలక పాత్ర పోషించేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ మైత్రిలో భాగంగా తొలి దశలో భారత్‌ 9 దేశాలకు 60 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసిందని గుటెర్రస్‌ తెలిపారు. ఆర్థిక స్థాయిలతో సంబంధం లేకుండా అన్ని దేశాలకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ని అందించడమే కోవాక్స్‌ లక్ష్యమని ఆయన అన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్‌ సైతం, కీలకమైన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోన్న భారత్‌ ‘నిజమైన మితృడు’అని కొనియాడారు. అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణకు లక్షలాది డోసుల వ్యాక్సిన్‌ని భారత్‌ సరఫరా చేయడం గొప్ప విషయమని పలు సరిహద్దు దేశాలు పేర్కొన్నాయి. 

మరిన్ని వార్తలు