మనకు రెండో ఇల్లు అదే.. కానీ అమెరికానే ఫేవరెట్‌

21 Jan, 2021 20:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశమే అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో భారత్‌కు విదేశాల నుంచి వలసలు తగ్గిపోయాయి. ఇలా బాగా వలసలు తగ్గిపోయిన దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో నివసిస్తున్నారు. దాదాపు 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా, ఆ తర్వాత మెక్సికో (1.1 కోట్ల మంది), రష్యా (1.1 కోట్ల మంది), చైనా (1 కోటి మంది), సిరియా (80 లక్షల మంది) జాతీయులు విదేశాల్లో ఉంటున్నారు.

కాగా అంతర్జాతీయ వలసలు– 2020 నివేదికను ఐక్యరాజ్య సమితి తాజాగా చేసింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన రెండు దశాబ్దాల్లో విదేశాల నుంచి వలసలు అత్యతంగా తగ్గిన దేశాల్లో అర్మేనియా మొదటి స్థానంలో నిలవగా, భారత్‌ రెండో స్థానంలో ఉంది. అర్మేనియా, భారత్, పాకిస్తాన్, ఉక్రెయిన్, టాంజానియా దేశాలకు విదేశీయుల రాక గణనీయంగా తగ్గినట్లు ఐరాస తెలిపింది. మరోవైపు జర్మనీ, స్పెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాకు వలసలు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. 

మనకు రెండో ఇల్లు యూఏఈ 
ప్రవాస భారతీయులకు భారత దేశం తర్వాత మరో ఇల్లుగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) మారింది. ప్రపంచంలోనే అత్యధికంగా 35 లక్షల మంది ప్రవాస భారతీయులు యూఏఈలో నివాసముంటుండగా, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉంటున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌లో కూడా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు. 2020లో 1,78,69,492 మంది ప్రవాస భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా, భారత్‌లో 48,78,704 మంది విదేశీయులు నివాసం ఉంటున్నారు. దేశ జనాభాలో వీరి శాతం 0.4 మాత్రమే కాగా, వీరిలో 2,07,334 మంది శరణార్థులున్నారు. 

అమెరికాయే ఫేవరెట్‌.. 
ప్రపంచవ్యాప్తంగా 28.1 కోట్ల వలసదారులు ఉండగా, వీరిలో మూడో వంతు 20 దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ వలసదారుల ఇష్టమైన దేశంగా అమెరికా నిలిచింది. అత్యధికంగా 5.1 కోట్ల మంది విదేశీయులు అమెరికాలో నివసిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల్లో 1.6 కోట్ల మందితో జర్మనీ రెండో స్థానంలో, 1.3 కోట్ల మందితో సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది. రష్యాలో 1.2 కోట్లు, బ్రిటన్, నెదర్లాండ్‌లో 90 లక్షల మంది విదేశీయులు ఉంటున్నారు. ఐరోపాలో అత్యధికంగా 8.7 కోట్ల వలసదారులు నివసిస్తుండగా, ఉత్తర అమెరికాలో 5.9 కోట్లు, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలో 5 కోట్ల మంది వలసదారులు ఉంటున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు