93 కోట్ల టన్నుల ఆహారం వృథా.. మన వాటా ఎంత?

6 Mar, 2021 17:22 IST|Sakshi

అందులో భారత్‌ వాటా 68 మిలియన్‌ టన్నులు

ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌–2021

ఐక్యరాజ్యసమితి: 2019లో ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్‌ టన్నుల ఆహారం వృథా అయ్యింది. ఇందులో భారతదేశం వాటా ఏకంగా 68.7 మిలియన్‌ టన్నులు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(యూఎన్‌ఈపీ) ఫుడ్‌ వేస్ట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌–2021లో వెల్లడించింది. 2019లో వృథా అయిన ఆహారంలో 61 శాతం గృహాల నుంచి, 26 శాతం ఫుడ్‌ సర్వీసు సెంటర్లు, 13 శాతం రిటైల్‌ మార్కెట్‌ నుంచి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో 17 శాతం వృథా కావడం గమనార్హం. దీన్ని 23 మిలియన్ల ట్రక్కుల్లో(40 టన్నుల సామర్థ్యం కలిగినవి) నింపొచ్చు.

ఈ ట్రక్కులను వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఆనుకునేలా నిలిపితే భూగోళాన్ని ఏడుసార్లు చుట్టేయవచ్చు. భారత్‌లో ప్రతి ఇంట్లో ఏటా 50 కిలోల ఆహారం వృథాగా మారిపోతున్నట్లు అంచనా. అంటే దేశవ్యాప్తంగా ప్రతిఏటా 6,87,60,163 టన్నుల తిండి వృథా అవుతోంది. అమెరికాలో ఇది 1,93,59,951 టన్నులు కాగా, చైనాలో 9,16,46,213 టన్నులు. గృహాల్లో అందుబాటులో ఉన్న ఆహారంలో 11 శాతం పనికిరాకుండా పోతోంది. ఫుడ్‌ సర్వీసు సెంటర్లలో 5 శాతం, రిటైల్‌ ఔట్‌లెట్లలో 2 శాతం ఆహారం వృథా అవుతోంది. కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి సమతౌల్యం, జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి ప్రతికూల పరిణామాలను ఆపాలంటే తొలుత ఆహార వృథాను అరికట్టడంపై దృష్టి పెట్టాలని యూఎన్‌ఈపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇంగర్‌ ఆండర్సన్‌ సూచించారు. ఆహార వృథాను అరికడితే ప్రపంచాన్ని కాపాడినట్లేనని పిలుపునిచ్చారు.   

మరిన్ని వార్తలు