చేష్టలుడిగిన భద్రతా మండలి: కొరోసీ

30 Jan, 2023 06:24 IST|Sakshi

ఐరాస: అత్యంత శక్తిమంతమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా చేష్టలుడిగిందని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు సబా కొరోసీ వాపోయారు. వర్తమాన కాలపు వాస్తవాలను అది ఎంతమాత్రమూ ప్రతిబింబించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధాలను నివారించి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మండలి ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోంది. దానికి కారణమూ సుస్పష్టం. దాని శాశ్వత సభ్య దేశాల్లోనే ఒకటి పొరుగు దేశంపై దురాక్రమణకు పాల్పడి ప్రపంచాన్ని తీవ్ర ప్రమాదంలోకి, సంక్షోభంలోకి నెట్టింది.

ఈ దుందుడుకుతనానికి గాను రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల వీటో పవర్‌ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. అందుకే మండలిని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మండలి కూర్పు రెండో ప్రపంచ యుద్ధానంతరపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. దాన్నిప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థల పనితీరు ఎలా ఉండాలనే విషయంలో రష్యా దురాక్రమణ పెద్ద గుణపాఠంగా నిలిచిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన కొరోసీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు