మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై అమెరికా కీలక వ్యాఖ్యలు

24 Jan, 2023 12:30 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి తెలియని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు ఈమేరకు బదులిచ్చారు. భారత్-అమెరికా బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఉండటానికి కారణమైన  భాగస్వామ్య విలువల గురించే తనకు తెలుసని చెప్పారు.

'మీరు అడుగుతున్న బీబీసీ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. కానీ భారత్-అమెరికా భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు. వీటి వల్లే రెండు దేశాలు బలమైన ప్రజాస్వామ్య, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నాయి. ఇండియాలో జరిగిన పరిణామాల గురించి గతంలోనే కొన్ని సందర్భాల్లో మాట్లాడాం.' అని ప్రైస్ పేర్కొన్నారు. భారత్-అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు కావడానికి రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు ప్రజా సంబంధాలు అత్యంత ముఖ్యమైనవని ప్రైస్ వివరించారు.

2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న మోదీపై బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే ఇది దురుద్దేశంతో తీసినట్లుగా ఉందని కేంద్రం ఫైర్ అయ్యింది. యూట్యూబ్, ట్విట్టర్‌లో ఈ వీడియోలను బ్లాక్ చేసింది.
చదవండి: ఇలాంటి సన్నివేశాన్ని ఇండియాలో ఊహించగలమా?

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు