ఐరాసలో రష్యాకు భారత్‌ షాక్‌.. కీలక ఓటింగ్‌లోనూ భారీ షాక్‌ ఇస్తుందా?

11 Oct, 2022 11:03 IST|Sakshi

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో భారత్‌ తన మిత్రదేశం రష్యాకు షాక్‌ ఇచ్చింది. ఉక్రెయిన్‌ భూభాగంలోని నాలుగు ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై.. రష్యా రహస్య బ్యాలెట్ కోసం డిమాండ్‌ చేసింది. అయితే.. రష్యా చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేసింది. 

ఆల్బేనియా తీసుకొచ్చిన ఈ డ్రాఫ్ట్‌ రెజల్యూషన్‌పై ఓటింగ్‌ విషయంలో పునరాలోచించాలని రష్యా.. ఐరాస సాధారణ అసెంబ్లీని డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో తీర్మానంపై ఓటింగ్‌ రహస్య బ్యాలెట్‌తో జరగాలా? బహిరంగంగా జరగాలా? అనే విషయంపై సోమవారం ఓటింగ్‌ నిర్వహించింది జనరల్‌ అసెంబ్లీ. రహస్య ఓటింగ్‌కు రష్యా పట్టుబట్టగా..  ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా భారత్‌ ఓటేసింది. మొత్తం 107 మంది సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో.. పదమూడు దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా ఓటేశాయి. మరో 39 దేశాలు (రష్యా, చైనా సహా) ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

రష్యా విజ్ఞప్తి మేరకు..  ఈ ఓటింగ్ నమోదు చేయబడింది. ఇందులో.. మాస్కో చేసిన సవాలుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వంద దేశాలలో భారతదేశం ఒకటి అని యూఎన్‌జీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓటింగ్‌ అనంతరం రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. UN సభ్యత్వం ఒక దారుణమైన మోసానికి సాక్ష్యంగా మారిందని, ఈ మోసంలో దురదృష్టవశాత్తు జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించారు అని ఆరోపించారు. 

UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ముసాయిదా ప్రకారం..  రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి, యుద్ధంలో దెబ్బతిన్న దేశం అంతర్జాతీయ సరిహద్దుల నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్‌పై తన ప్రకోపరహిత దూకుడు యుద్ధాన్ని నిలిపివేయాలి.  అలాగే.. రష్యా చర్యను గుర్తించవద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ఘాటిస్తుందని తెలిపింది. బుధవారంగానీ, గురువారంగానీ ఈ తీర్మానంపై బహిరంగ ఓటింగ్‌ జరగనుంది.

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని లుగన్‌స్క్‌, డోనెట్‌స్క్‌, ఖేర్‌సన్‌, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా తీరును ఖండించాయి. రష్యా రిఫరెండం చట్టవిరుద్ధంగా పేర్కొంటూ అమెరికా-ఆల్బేనియాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా.. భారత్‌ ఆ ఓటింగ్‌కు దూరంగా ఉంది. పైగా రష్యా వీటో జారీ చేయడంతో.. ఆ తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలోనే ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది ఆల్బేనియా. 

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ/రష్యా మిలిటరీ చర్య విషయంలో మొదటి నుంచి తటస్థ స్థితిని అవలంభిస్తోంది భారత్‌. శాంతి చర్చల ద్వారానే సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని చెబుతూ వస్తోంది. అయితే తాజాగా ఉక్రెయిన్‌పై క్షిపణుల దాడులు పెరిగిపోతుండడంతో ఆందోళన సైతం వ్యక్తం చేసింది భారత్‌. పరిస్థితి మామూలు స్థితికి చేరేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో రెండురోజుల్లో జరగబోయే కీలక ఓటింగ్‌లో తటస్థ వైఖరినే అవలంభిస్తుందా? లేదంటే ఇప్పుడు బహిరంగ ఓటింగ్‌కు మొగ్గుచూపినట్లే కీలక ఓటింగ్‌ రష్యాకు ఝలక్‌ ఇస్తుందా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!.

మరిన్ని వార్తలు