Unidentified Anomalous Phenomena: కలవో, లేవో...!

18 Sep, 2023 06:02 IST|Sakshi

ఏలియన్స్‌ ఉనికిపై వీడని సందిగ్ధం

ఎటూ తేల్చని నాసా ఏడాది అధ్యయనం

అర్థం కాని కొన్ని ఘటనలైతే ఉన్నాయన్న ప్యానల్‌

మరిన్ని నిధులు, మరింత పరిశోధన అవసరమని ముక్తాయింపు

ఏలియన్స్‌. ఎక్స్‌ట్రా టెరిస్ట్రియల్స్‌. గ్రహాంతరవాసులు.. ఇలా వాళ్లకు ఎన్నెన్నో పేర్లు. వాళ్ల చుట్టూ ఎన్నెన్నో కథలు. వాళ్ల ఉనికిపై ఎన్నెన్నో కథనాలు. వాళ్లు భూమిపైకి వచ్చిపోయేందుకు ఉపయోగిస్తారని చెప్పే ఫ్లయింగ్‌ సాసర్స్‌ (ఎగిరే పళ్లాలు) చుట్టూ మరెన్నో పుకార్లు. వాటిని చూశామంటూ గత ఒకట్రెండు శతాబ్దాలలో ఎంతోమంది పత్రికలకు, టీవీలకు ఎక్కారు. కొన్నిసార్లు వినువీధిలో కొన్ని వింత వస్తువులు కెమెరాలకు చిక్కాయి.

అవి ఎగిరే పళ్లాలేనని నమ్మిన వాళ్లు, వాటిలో గ్రహాంతరవాసులు వచ్చారని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్లు ఎందరో! దాంతో ఈ విషయంపై నాసా ఇటీవల కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది. దీన్ని ఇప్పటిదాకా గుర్తించని అసాధారణ దృగ్విషయం (అన్‌ ఐడెంటిఫైడ్‌ అనామలస్‌ ఫినామినా – యూఏపీ)గా పేర్కొంటూ, దీని తాలూకు నిజానిజాలను నిగ్గుదేల్చేందుకు ఒక స్వతంత్ర కమిటీ వేసింది. అది ఏడాది పాటు అన్ని కోణాల్లో పరిశోధన చేసి 33 పేజీల నివేదిక సమర్పించింది. అయితే ఏలియన్స్‌ గానీ, అవి ప్రయాణించే ఎగిరే పళ్లాలు గానీ ఉన్నాయని గానీ, లేవని గానీ ఇదమిత్థంగా నివేదిక ఎటూ తేల్చకపోవడం విశేషం!

నాసా యూఏపీ ప్యానల్‌ నివేదిక ముఖ్యాంశాలు
► ఇప్పటిదాకా మా పరిశీలనకు వచ్చిన అసాధారణ దృగ్విషయాల్లో (అన్‌ ఐడెంటిఫైడ్‌ అనామలస్‌ ఫినామినా – యూఏపీ) చాలావాటి అసలు స్వభావాన్ని కచ్చితంగా నిర్ధారించలేకపోయాం.
► ఎగిరే పళ్లాలుగా చెప్పిన వాటికి నిజంగా గ్రహాంతర మూలాలున్నట్టు తేలలేదు.
► వీటిలో చాలావరకు బెలూన్లు, డ్రోన్లు, విమానాలుగా తేలాయి.
► అయితే కొన్ని యూఏపీ కేసులు అప్పటిదాకా మనకు తెలిసిన ఏ దృగ్విషయంతోనూ సరిపోలలేదు.
► ఏలియన్స్, ఎగిరే పళ్లాల విషయంలో ప్రజల్లో నెలకొని ఉన్న అంతులేని ఆసక్తి అర్థం చేసుకోదగిందే. అందుకే ఈ విషయమై ఎలాంటి కొత్త సమాచారం తెలిసినా ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటాం.

నాసాకు యూఏపీ ప్యానల్‌ సిఫార్సులు
► యూఏపీ సంబంధిత డేటా సేకరణ, విశ్లేషణ కోసం ఒక స్టాండర్డ్‌ విధానాన్ని ఏర్పాటు చేయాలి.
► యూఏపీలపై అవగాహనను విస్తృతం చేసుకోవడానికి కృత్రిమ మేధ తదితర టెక్నాలజీల సాయం తీసుకోవాలి.
► యూఏపీల అధ్యయనంలో పారదర్శకత, ఇతర దేశాలు, అధ్యయన సంస్థలతో పరస్పర సహకారం చాలా అవసరం.
►  యూఏపీ పరిశోధనలకు, డేటా సేకరణ, అధ్యయనం, ప్రభుత్వ, విదేశీ, అంతర్జాతీయ సంస్థలతో మరింత సమన్వయం తదితరాల నిమిత్తం ఈ ప్రాజెక్టుకు నిధులను మరింత పెంచాలి.

ఎగిరే పళ్లాలను గురించి జనాల్లో నెగటివ్‌ భావజాలం ఎంతగానో పాతుకుపోయింది. ఏలియన్స్‌ ఉనికి తాలూకు నిజానిజాలను నిర్ధారించేందుకు అత్యంత కీలకమైన డేటాను సేకరించడంలో ఇదే అతి పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది’   
 – నాసా యూఏపీ అధ్యయన బృందం

ఏలియన్స్‌ ఉన్నదీ లేనిదీ పక్కాగా తేల్చాలన్నా, దీనిపై లోతుగా పరిశోధన చేయాలన్నా ఇప్పుడున్న వాటికి చాలా భిన్నమైన, సృజనాత్మక శాస్త్రీయ అధ్యయన పద్ధతులు అత్యాధునికమైన శాటిలైట్‌ టెక్నాలజీ కావాలి. అంతకు మించి, ఈ అంశంపై జనం దృక్కోణంలోనే మౌలికంగా చాలా మార్పు రావాలి’  
– నాసా

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

మరిన్ని వార్తలు