Nirav Modi: వేల కోట్లు ఎగొట్టి.. డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలంటున్న నీరవ్‌ మోదీ

11 Mar, 2023 18:03 IST|Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రూ.11వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని వేల కోట్లు స్కాంలో కీలక నిందితుడు అయిన నీరవ్‌ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని చెబుతున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా స్వయంగా అతనే ఈ వ్యాఖ్యలు చేశాడు. నీరవ్‌ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయాత్నాలు చేస్తూనే.. మరోవైపు బ్యాంకులకు ఎగనామం పెట్టిన మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేసే పనిలో పడింది.

పైసలు లేవు.. అప్పు తీసుకుంటా
ప్రస్తుతం నీరవ్ నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అతడిని భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెల్లింపులకు సంబంధించి నీరవ్‌ అక్కడి నుంచే వర్చువల్‌ ద్వారా తూర్పు లండన్‌లోని బార్కింగ్‌సైడ్ మేజిస్ట్రేట్ కోర్టులో ముందు హాజరయ్యాడు. చెల్లింపులపై వజ్రాల వ్యాపారి న్యాయస్థానానికి ఈ రకంగా విన్నవించుకున్నాడు.. తాను కోర్టు తీర్పు ప్రకారం డబ్బులను ఒకేసారి చెల్లించలేనని, నెలకు 10 వేల పౌండ్ల చొప్పున కడతానని అభ్యర్థించాడు.

ఎందుకంటే భారత ప్రభుత్వం తన ఆస్తులన్నీ సీజ్‌ చేయడంతో డబ్బులు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం దీనిపై  న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆ 10 వేల పౌండ్లను ఎక్కడి నుంచి తెస్తావని అడగగా.. కోర్టుకు చెల్లించాల్సిన మొత్తం కోసం రుణం తీసుకుంటున్నానని చెప్పాడు. కాగా ఈ వ్యాపారవేత్తపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగాల ఆధారంగా నేరవ్ మోదీని 2019 మార్చిలో అరెస్టు చేసిన మూడేళ్ల తర్వాత అప్పీల్‌ను తిరస్కరించడం జరిగింది.

మరిన్ని వార్తలు